ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల అనంతరం తొలిసారిగా సోమవారం మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కేబినేట్ మంత్రులు పాల్గొననున్నారు.  ఈ మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. ఉదయం సీఎం నివాస గృహంలో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరుగనుండగా సాయంత్రం సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో కేబినెట్ భేటీ జరుగనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉదయం జరిగే పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో హోదా ఉద్యమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే విషయంతో పాటు, నేటి బంద్ పై చర్చించనున్నారు. ఏప్రిల్ 20న పుట్టినరోజునాడు తలపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరాహార దీక్ష,   అదేరోజు రాష్ట్రవ్యాప్తంగా మండల, జిల్లా కేంద్రాల్లో సైకిల్‌ ర్యాలీలు, నిరాహార దీక్షలపై ప్రణాళికను రూపొందించనున్నారు. ఏప్రిల్ 30న తిరుపతిలో నిర్వహించే బహిరంగసభపై కూడా సమావేశంలో చర్చకు రానుంది.


సచివాలయంలో సాయంత్రం జరిగే కేబినెట్‌ సమావేశంలో ప్రధానంగా అగ్రిగోల్డ్‌ వ్యవహారంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. అగ్రిగోల్డ్‌ ఆస్తులను తీసుకోవడానికి ఎస్‌ఎల్‌జీ గ్రూప్‌ వెనుకాడుతోన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే వాటిని స్వాధీనం చేసుకుని బాధితులకు పరిహారం చెల్లించే విషయంపై కేబినెట్‌లో చర్చించనున్నారు. అదేవిధంగా నిరుద్యోగ భృతి, పలు సంస్థలకు భూకేటాయింపులు, ఎమ్మెల్యేలపై కేసుల విచారణకు గన్నవరంలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు, తదితర అంశాలపై కూడా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై చర్చించనున్నారు. అలాగే రాష్ట్రంలోని వివిధ పథకాలకు కేంద్ర ప్రభుత్వ నిధుల కేటాయింపులో జాప్యం, పోలవరం తదితర విషయాలపై కూడా మంత్రి వర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.