శ్రీశైలం: కర్నూలు జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చిన్నారుట్ల వద్ద అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఘాట్‌ రోడ్డుపై వున్న ప్రహరీగోడను ఢీకొని ఆ పక్కనే లోయలో పడిపోయింది. ఆదివారం ఉదయం 6గంటలకు దొర్నాల అటవీశాఖ ‌టోల్‌గేట్‌ దాటిన అనంతరం శ్రీశైలానికి 15కిమీ దూరంలోని చిన్నారుట్ల మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. బస్సు బ్రేకులు ఫెయిల్‌ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు డ్రైవర్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికుల వరకు ఉన్నారు. అదృష్టవశాత్తుగా ఈ ప్రమాదం నుంచి ప్రయాణీకులు అందరూ ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. బస్సులో ప్రయాణిస్తున్న వాళ్లంతా మహారాష్ట్రలోని బీడ్ జిల్లా పెరళికి చెందినవారు. 


ప్రమాదంపై  సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. ప్రయాణీకులను సురక్షితంగా బస్సులోనుంచి బయటకు తీసుకొచ్చి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.