ఏపీకి హోదా ఇస్తే వాళ్లు కూడా అడుగుతారు: కేంద్ర మంత్రి
ఆంధ్రప్రదేశ్‌కు అన్ని విధాలా సాయం చేస్తున్నామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు అన్ని విధాలా సాయం చేస్తున్నామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. విజయవాడకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రధాని మోదీకి ఎలాంటి వివక్ష లేదన్నారు. ఏపీకి హోదా ఇస్తే మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాలు కూడా అడుగుతాయని చెప్పారు. హోదా ద్వారా వచ్చే అన్ని ప్రయోజనాలను ఏపీకి దక్కేలా కేంద్రం చర్యలు తీసుకుందని చెప్పారు. గతంలో బీజేపీ హయంలో ఏర్పడిన మూడు రాష్ట్రాలకు హోదా ఇవ్వలేదనే విషయాన్ని గుర్తుచేశారు.
ఏపీకి అందించే సాయంలో కేంద్రంలో ఉన్న మోదీ సర్కార్ ఎన్నడూ వెనక్కి తగ్గలేదని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడానికి రాష్ట్ర ప్రభుత్వ వైఖరే కారణమని జితేంద్ర సింగ్ చెప్పారు. వినియోగ పత్రాల గురించి టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని, అలాంటప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమాధానమిస్తే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ పార్టీ బయటికి వెళ్లిందని ఆయన పేర్కొన్నారు.