Submerged Bikes & Cars: బుడమేరు వరద, భారీ వర్షాలు విజయవాడను ముంచేశాయి. దాదాపు 60 శాతం విజయవాడ మునిగిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. కళ్ల ముందే ఇళ్లూ వాకిలి కొట్టుకుపోయాయి. వాహనాలైతే ఎక్కడికి కొట్టుకుపోయాయో తెలియని పరిస్థితి. వరద నీటి మట్టం తగ్గడంతో ఇప్పుడు వాహన బాధితులు వస్తుందో రాదో తెలియని ఇన్సూరెన్స్ కోసం క్యూ కడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విజయవాడ వరదల్లో 35 మంది మృత్యువాత పడ్డారు. లెక్కలేని మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి. ఇక ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు కొట్టుకుపోయాయి. మరి కొన్ని వాహనాలు నాలుగు రోజులుగా నీట మునిగిపోయాయి. వరద నీరు పోవడంతో కొట్టుకెళ్లిన, వరద ముంపుకు గురైన వాహనాలు బయటపడుతున్నాయి. కార్లు సొట్టలు పడి, రంగు వెలిసిపోయి, అద్దాలు పగిలిపోయి, డోర్లు వంకర పోయి, ఇంజన్లలో బురద నీరు వెళ్లి భయంకరంగా తయారయ్యాయి. అసలు ఆ కార్లు, ఆటోలు, స్కూటర్లు పనిచేస్తాయా లేదా అనే అనుమానం ఉంది. షోరూంలలో కొత్త వాహనాలు సైతం నీట మునిగిపోయాయి. కార్ల గోడౌన్లో కోట్లు విలువ చేసే కార్లు మునిగిపోయాయి. 


కొందరికైతే తమ వాహనాలు ఎటు కొట్టుకుపోయాయో తెలియని పరిస్థితి. ఇప్పటి వరకూ ఉన్న అంచనా ప్రకారం లక్షన్నర వరకు బైక్‌లు, స్కూటర్లు, 35 వేల కార్లు, 6-7 వేల ఆటోలు ఇతర వాహనాలు నీట మునిగాయి. ప్రస్తుతం విజయవాడలో ఏ మెకానిక్ షెడ్‌లో చూసినా వరద ముంపుకు గురైన వాహనాలే కన్పిస్తున్నాయి. ప్రతి మెకానిక్ షెడ్ వద్ద వందలాది వాహనాలు ఉన్నాయి. మెకానిక్‌లకు ప్రస్తుతం విజయవాడలో డిమాండ్ పెరిగింది. ఇంజన్‌లో నీరు చేరి ఉంటే స్టార్ట్ చేయవద్దని సూచిస్తున్నారు. స్టార్ట్ చేస్తే వాహనం పూర్తిగా పాడయ్యే అవకాశముంది. అందుకే స్టార్ట్ చేయకుండా తీసుకొస్తే మరమ్మత్తు చేసేందుకు అవకాశముంటుందంటున్నారు మెకానిక్‌లు. 


ఇదంతా ఓ ఎత్తైతే వరద ముంపుకు గురైన వాహనాలకు ఏ మేరకు ఇన్సూరెన్స్ వర్తిస్తుందో తెలియక సతమతమవుతున్నారు. వరద ముంపుకు గురైన వాహనాలకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ 15 రోజుల్లో సెటిల్ అయ్యేలా చూసేందుకు బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ కంపెనీలల ప్రతినిదులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే సమావేశమయ్యారు. ముంపు ప్రాంతాల్లో ఉండేవారంతా పేద, మధ్య తరగతి ప్రజలయినందున మానవీయ కోణంలో స్పందించాలని కోరారు. 


ఇక ఇన్సూరెన్స్ పరిధిలో వరదలు, భూకంపాల కవరేజ్ ఉందో లేదో చెక్ చేసుకునే పనిలో పడ్డారు అందరూ. అందరూ ఇన్సూరెన్స్ కంపెనీలకు పరుగులు తీస్తున్నారు. వరద ముంపుకు గురైన వాహనాలకు ఇన్సూరెన్స్ వస్తుందో లేదోనని ఎంక్వైరీ చేసుకుంటున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద ఇప్పుడు క్యూ పెరిగిపోతోంది. వాహనాల ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఆలస్యం కాకుండా చూడాలని ఐఆర్‌డిఏ బీమా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. 


Also read: AP Heavy Rains: ఇవాళ్టి నుంచి కోస్తాంధ్రలో భారీ వర్షాలు, ఈ జిల్లాల్లో జాగ్రత్త



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.