Kesineni Nani On Chandrababu Naidu: తాను త్వరలో వైసీపీలో చేరుతున్నట్లు విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రకటించారు. బుధవారం సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసిన ఆయన.. అనంతరం మీడియా మాట్లాడారు. 2013 జనవరి నుంచి టీడీపీ అభివృద్ది కోసం పని చేస్తూ వచ్చానని అన్నారు. నాటి నుంచి నేటి వరకు పార్టీ కోసం కష్టపడిన తీరు అందరికీ తెలుసని.. 2014 ఎన్నికల తర్వాత పంచాయతీ ఎన్నికలు, ఇతర స్థానిక సంస్థల ఎన్నికలను తన భుజస్కందాల మీద వేసుకుని చేశానని గుర్తు చేశారు. కొంతమందికి ఆ రోజు నెలవారీ జీతాలు కూడా తన చేతుల మీదుగా ఇచ్చానని.. తన సొంత వ్యాపార సంస్థ కన్నా.. టీడీపీ గెలుపే ముఖ్యంగా పని చేశానని చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"అంతకముందు కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చి చాలా మంది గెలుపొందారు. టీడీపీలో అన్ని స్థాయి ఎన్నికలలో  విజయం కోసం పని చేశాను. 2019 ఎన్నికల సమయంలో నాకు సీటు ఇచ్చేందుకు ఇబ్బంది పెట్టారు. ప్రజాగ్రహం చూసి ఆ తర్వాత నాకే సీటు ఇచ్చారు. నేను అక్రమ సంపాదనకు ఆశపడకుండా పార్టీ, ప్రాంతం కోసం పని చేశాను. వ్యాపారం మానుకున్నా.. ఆస్తులు అమ్ముకున్నా.. వ్యాపారం కాకుండా హైదరాబాద్‌లో రెండు వేల కోట్లు ఆస్తులు నేను అమ్ముకున్నాను. కొన్ని విషయాలలో చంద్రబాబు నా పట్ల ప్రవర్తించిన తీరు వల్ల నేను వ్యాపారం వదిలాను.


2019 ఎన్నికలలో నారా లోకేష్ ఓడిపోయారు. నేను ఎంపీగా ఇక్కడ గెలిచాను.. ప్రజల అభిమానం పొందాను. ఆ తర్వాత వారి మనుషులను పెట్టి.. నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. మేయర్ ఎన్నికలు వచ్చిన సమయంలో.. చంద్రబాబు అడిగితే ఇంఛార్జిలు ఇష్టం అని చెప్పాను. బోండా ఉమా గారి సతీమణిని పెడుతున్నారా.. అదే జరిగితే చాలా ప్రమాదకరం అని చంద్రబాబు చెప్పారు. ఆ తర్వాత నా కుటుంబం నుంచి ఒకరు ఉంటే బాగుంటుందని ఒత్తిడి తెచ్చారు. టాటా సంస్థల్లో పని చేస్తున్న నా కుమార్తె శ్వేతను తీసుకువచ్చి పోటీ చేయించాను. ఎన్నికల సమయంలో కొంతమంది వ్యక్తులను తీసుకువచ్చి.. నన్ను తిట్టించారు ఎంపీ నానిని చెప్పు తీసుకుని కొడతాను అని ఒక క్యారెక్టర్ లెస్ పర్సన్ అన్నాడు. ఒక పొలిట్ బ్యూరో సబ్యుడు నన్ను గొట్టం గాడు అన్నాడు


పార్టీ నుంచి ఈ విమర్శలపై కనీసం స్పందన లేదు. చంద్రబాబుతో ప్రచారానికి రావద్దని నాకే చెప్పారు. సిట్టింగ్ ఎంపీ లేకుండా.. నన్ను తిట్టిన వ్యక్తులతో చంద్రబాబు ప్రచారం చేశారు. రాబిన్ శర్మ టీం వచ్చి ఐదు సీట్లు కన్నా ఎక్కువ రావడం లేదని చెప్పారు. అయినా నేను చూసుకుంటాను అని దైర్యంగా ముందుకు అడుగేశాను. పార్టీ డబ్బుతో సంబంధం లేకండా.. నా సొంత డబ్బుతో నేను గెలిపించాను. ఒక పార్టీ అధ్యక్షుడు.. ఒక పార్టీ ఎంపీని రావద్దంటే భరించా. నన్ను చెప్పుతీసుకుని కొడతా అన్నా, గొట్టంగాడు అన్నా భరించా.. పార్టీలో ఉంటూ ఎన్ని అవమానాలు నేను పడాలి..? మీకు ఇష్టం లేకపోతే నేనే తప్పుకుంటానని అధ్యక్షుడికి చెప్పాను. ముఖ్య నాయకుల ముందే.. ఆ రోజు నువ్వే ఉండాలని నాకు చెప్పారు. నువ్వే ఎంపీగా ఉంటేనే.. పార్టీకి మంచి జరుగుతుందని ఆయన చెప్పారు." అని ఎంపీ కేశినేని అన్నారు.


తన కుటుంబ సభ్యుడికి ఎంపీ సీటు అడిగితే ఇవ్వడంలో తప్పు లేదని.. విశాఖ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావు పేట ఎంపీ సీట్లలో కమ్మవారే పోటీ చేస్తారని, రాజమండ్రి, ఏలూరు, నరసరావు పేటలో ఇవ్వకుండా.. ఇక్కడ తనకు పోటీగా ఇవ్వడం ఏమిటి..? అని ప్రశ్నించారు. తాను ఎక్కడికైనా వెళితే నాయకులు ఆ సభలకు రారని.. ఆయన వెళితే ఆ నాయకులు అందరూ మాత్రం హాజరవుతారని అన్నారు. 


తిరువూరు సన్నాహక సభ కోసం వెళితే.. రౌడీ మూకలతో తనను కొట్టించాలని చూశారని కేశినేని అన్నారు. తన కుటుంబ సభ్యుడితోనే తనపై దాడి చేయాలని లోకేష్ అనుకున్నాడని.. ఏం తప్పు చేశాను..? పార్టీకి ఏం అన్యాయం చేశాను..? అని నిలదీశారు. చివరకు తమ కుటుంబాల మధ్య కూడా చిచ్చు పెట్టారని ఫైర్ అయ్యారు. స్పీకర్‌కు రాజీనామా లేఖను మెయిల్ ద్వారా పంపించానని.. టీడీపీకి కూడా త్వరలోనే రాజీనామా చేస్తానని తెలిపారు. జగన్‌ మోహన్ రెడ్డితో కలిసి ప్రయాణించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.