Youth Vandalizes Theatre Screen During Tholi Prema Re-release: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తొలి ప్రేమ సినిమా నిన్న రీరిలీజైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిన్న రాత్రి విజయవాడలోని కపర్థి సినిమా థియేటర్‌లో సెకండ్ షో రన్ అవుతున్న సమయంలో అభిమానుల పేరుతో బీభత్సం సృష్టించారు. కపర్థి థియేటర్లో సినిమా చూడ్డానికి వచ్చిన యువకులు.. షో నడుస్తుండగా తెర చించేసి, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. థియేటర్ లో విధ్వంసం సృష్టించి, థియేటర్ యాజమాన్యాన్ని భయబ్రాంతులకు గురిచేయడంతో పాటు, భారీ మొత్తంలో ఆస్తి నష్టం చేయాలనే కుట్రతోనే  వచ్చారని వారి వైఖరి చూస్తే అర్థం అయిందని కపర్థి థియేటర్ సిబ్బంది ఆరోపించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సినిమా నడుస్తుండగానే మధ్యలో ఒక 10 మంది యువకులు అకస్మాత్తుగా లేచి గొడవ గొడవ చేశారని.. స్క్రీన్‌పైకి ఎక్కి తెరను మొత్తం కోసేశారని.. అదే సమయంలో సీట్లను సైతం ధ్వంసం చేసిన తీరు చూస్తోంటే వారు కావాలనే గొడవకు వచ్చినట్టు స్పష్టంగా అర్థం అవుతోంది అని కపర్థి థియేటర్ యజమాన్యం వాపోయింది. చివరకు ఇదేంటని అడ్డు వచ్చిన సిబ్బందిపై సైతం దాడి చేశారని.. తమ దాడికి సంబంధించిన దృశ్యాలు ఏవీ ఆధారంగా చిక్కకూడదు అనే ఉద్దేశంతో సీసీ  కెమెరాలను కూడా ధ్వంసం చేశారని అన్నారు. థియేటర్ హాలు బయట ఉన్న అద్దాలను కూడా పగలగొట్టి థియేటర్ కి వచ్చిన జనం కూడా హడలిపోయేలా చేశారు అని ఆందోళన వ్యక్తంచేశారు.


పవన్ కళ్యాణ్ అభిమానులు పేరుతో కావాలనే చేశారు. నిజంగా అభిమానులు చేశారా.. లేక ఏవైనా రాజకీయ కారణాలతో చేశారా అనేది పోలీసులే నిగ్గు తేల్చి తమకు న్యాయం చేయాలని థియేటర్ యాజమాన్యం పోలీసులను కోరింది. రాత్రి జరిగిన ఘటనను చూస్తే విధ్వంసం వెనుక రాజకీయ కుట్ర కోణం ఉంది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అని అనుమానం వ్యక్తంచేసిన థియేటర్ యాజమాన్యం.. పోలీసులు విచారణ చేసి విధ్వంసం చేసిన వారిని శిక్షించాలి అని పోలీసులకు విజ్ఞప్తిచేశారు. థియేటర్లలో ఇకపై ఇలాంటివి జరగకుండా పవన్ కళ్యాణ్ కూడా తమ అభిమానులను నిరోధించాలి అని థియేటర్ యాజమాన్యం కోరుతోంది.