Pawan Kalyan Links Jagan With Telangana: తెలంగాణ ప్రజల ఆక్రోశానికి జగన్ కూడా ఒక కారణం అని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తమ నేల, తమ ప్రాంతం, తమ ఉద్యోగాలు, తమ నీళ్లు, నిధులు కోసం పోరాడి తెలంగాణ తెచ్చుకున్న అక్కడి యువత ఆవేశానికి జగన్ లాంటి వ్యక్తుల బహిరంగ దోపిడీ కూడా ఓ కారణమే అని అన్నారు. ప్రత్యక్షంగా జగన్ లాంటి వారు భూముల దోపిడీకి పాల్పడటం చూసిన అక్కడి యువత, ఇలాంటి వారి వల్లే మనం వెనుకబడుతున్నాం.. వీళ్లే మన వనరులు దోచుకుంటున్నారు అనే కోపంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నారు అని అభిప్రాయపడ్డారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జగన్ లాంటి వారి దోపిడీని చూసి, ఆంధ్ర వ్యక్తులంతా దోపిడీదారులు అని అనుకోవడమే కాదు... అదే నినాదంతో ముందుకు వెళ్లి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నారు. అందుకే తాను మొదటి నుంచి జగన్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కాకూడదు అని ఎందుకు చెబుతున్నాను అంటే.. తెలంగాణలో వీళ్లు సాగించిన భూదందా, స్కాంలను చూసి విసిగిపోయాను. అదే పరిస్థితి ఆంధ్రాకు కూడా వస్తుందని భయపడ్డాను. నేను ఏదైతే జరగకూడదు అని భయపడ్డానో.. అదే జరుగుతోంది. నా భయం ఇప్పుడు ఆంధ్ర ప్రజలంతా ప్రత్యక్షంగా చూస్తున్నారు.. అనుభవిస్తున్నారు అని చెబుతూ ఏపీ భవిష్యత్తు గురించి పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తంచేశారు. 


నేరాలకు అడ్డాగా ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ ను నేరాలకు అడ్డాగా మార్చారు. 30 వేల మంది ఆడపడుచులు కనిపించకుండా పోతే ఓ బాధ్యతగల ముఖ్యమంత్రి వారు ఏమయ్యారో తెలసుకునేందుకు కనీసం ఓ సమీక్ష నిర్వహించింది లేదు. పోలీసు వ్యవస్థతో మాట్లాడింది లేదు. గంజాయి రవాణాలో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపారు. గంజాయి మత్తులో నేరాలు అధికం అయ్యాయి. గంజాయి నియంత్రణ కోసం పనిచేసి, వేలాది కిలోల గంజాయిని పట్టుకొని తగులబెట్టిన గౌతం సవాంగ్ వంటి ఐపీఎస్ అధికారిని అర్జంటుగా బదిలీ చేశారు. విశాఖ ఎంపీ కుటుంబాన్ని ఓ రౌడీషీటర్ బంధించే స్థాయికి పరిస్థితి వచ్చింది. ఆడబిడ్డల రక్షణకు భరోసా లేదు. నోబెల్ శాంతి బహుమతి పొందిన కైలాష్ సత్యర్థి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నంత చిన్నారుల అక్రమ రవాణా మరెక్కడా లేదని చెప్పడం అంతా గమనించాలి. ఎందుకు చిన్నారులు మాయం అవుతున్నారు..? వారెక్కడికి వెళ్తున్నారు అనేది గమనించాలి. నేను ఆడపడుచుల అదృశ్యం మీద గొంతు ఎత్తితే, వైసీపీ నాయకులు నోరు వేసుకొని నా మీద బూతుపురాణంతో పడ్డారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో ఆడపడుచుల మిస్సింగ్ కేసుల మీద కేంద్రమే పార్లమెంటు సాక్షిగా వివరాలు వెల్లడించింది. వాటిలో నేను చెప్పిన కంటే లెక్కలు ఎక్కువగానే ఉన్నాయి. 


జగన్ ఒక దొంగ... డెకాయిట్
జగన్ ఒక దొంగ, డెకాయిట్. లెక్కలు చూపించకుండా వేలకోట్లు దోచేశాడు. ఈ రోజుకి కాగ్ లెక్కలు చెప్పండి అని అడిగినా చెప్పడం లేదు. మన రాష్ట్రంలో దాదాపు చిన్నా, పెద్ద కలిపి 13,371 పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీలు స్వతంత్రంగా వ్యవహరించాలి. సొంత అవసరాల కోసం ఇతరులపై ఆధారపడకూడదు. స్వావలంబన సాధించాలి. గ్రామాలు బావుంటేనే దేశం బాగుంటుంది. గ్రామ స్వరాజ్యం గురించి మహాత్మా గాంధీ చెప్పిన మాటలివి. గ్రామ స్వరాజం అంటే వాలంటీర్లతో నింపేయడం అనుకుంటున్నాడు జగన్. పంచాయతీలకు వచ్చే ఆర్థిక సంఘం నిధులను దాదాపు రూ.1,191 కోట్లు దారిమళ్లించి వాలంటీర్లకు జీతాలుగా ఇచ్చేశాడు. దీంతో గ్రామాల్లో బ్లీచింగ్ చల్లడానికి కూడా నిధులు లేకుండా చేశారు. 
జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక పంచాయతీ రాజ్ వ్యవస్థకు పునర్జీవం పోస్తాం. పంచాయతీల నిధులు గ్రామాభివృద్ధికే ఖర్చు పెట్టేలా చూస్తాం. గ్రామ సభలను బలోపేతం చేసి స్థానిక వనరులపై సంపూర్ణ అధికారం ఉండేలా చేస్తాం. గ్రామాలకు ప్రథమ పౌరుడైన సర్పంచులను డమ్మీలు చేసి వాలంటీర్లు అనే సమాంతర వ్యవస్థను తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధం. దానిపై సర్పంచులు న్యాయం పోరాటం చేస్తే జనసేన వారికి అండగా నిలబడుతుంది. 


విశాఖను దోపిడీ కేంద్రంగా మార్చిన వైసీపీ   
వైసీపీ వచ్చాక విశాఖలో జరిగిన దోపిడీ మరెక్కడా జరగలేదు. నేను మరి మరీ ఎంతో మొత్తుకొని మరీ చెప్పాను. వైసీపీ ప్రభుత్వం వస్తే ప్రకృతి వనరులు మింగేస్తారని, కొండలను కొల్లగొడతారని చెవులకు ఇళ్లు కట్టుకొని మరీ చెప్పాను. నా మాట వినలేదు. వైసీపీ వచ్చిన తర్వాత విశాఖలో జరిగిన విధ్వంసం, దోపిడీ మరెక్కడా జరగలేదు. సముద్ర తీరానికి మణిహారంలాంటి రుషికొండను పూర్తిగా కొల్లగొట్టారు. శ్రీలంక, తమిళనాడు ప్రాంతాల్లోనే కనిపించే ఎర్రమట్టి దిబ్బలను లేపేశారు. భూ అక్రమాలకు విశాఖను కేంద్రంగా చేసి, వేలాది ఎకరాలు మింగేయడానికి పన్నాగం పన్నుతూనే ఉన్నారు. ప్రశాంతతకు మారుపేరైన, మహిళల భద్రతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న విశాఖను శాంతిభద్రతలకు విఘాత కేంద్రం చేశారు. ప్రకృతి అందాలకు నెలవైన విశాఖను భయం గుప్పటి బతికేలా మార్చారు.


ఇది కూడా చదవండి : Pawan Kalyan Slams Jagan: జగన్ ఆంధ్రా వీరప్పన్.. పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు


ఆంధ్రా యూనివర్శిటీను జగన్ భ్రష్టు పట్టించాడు
సమాజానికి ఎంతో గొప్ప వ్యక్తులను అందించిన ఆంధ్ర యూనివర్సిటీని జగన్ భ్రష్టు పట్టించాడు. శ్రీ కట్టమంచి రామలింగా రెడ్డి, శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి మేధావులు ఉప కులపతులుగా ఆంధ్రా యూనివర్సిటీని ఒక గొప్ప స్థాయికి తీసుకువెళ్లారు.  నేషనల్‌ ఇనిస్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ ర్యాంకింగ్స్ లో ఐదేళ్ల క్రితం 29వ స్థానంలో ఉన్న ఏయూ 76వ స్థానానికి పడిపోయింది. వర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చేశారు ఇప్పటి వీసీ. వైసీపీ నాయకుల పుట్టిన రోజులను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. విద్యార్థులకు మందు, గంజాయ్ సులభంగా దొరుకుతోంది. వర్సిటీ భూములను ముక్కలుగా చేసి రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. అధికారంలోకి వస్తే విద్యార్ధులకు అండగా ఉంటామని చెప్పి ఫీజులు పెంచేశారు. కీలకమైన డిపార్టుమెంట్లు తీసేశారు. ఖాళీగా ఉన్న ఆచార్యుల పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి నేటికి దాదాపు వెయ్యి  పోస్టులను ఖాళీగా ఉంచారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయించేలా చూడాలని కాలేజీ ప్రిన్సిపల్స్ కు వర్సిటీ వీసీ అడగడమేంటి? ఆయన పనిచేసేది విద్యార్థుల కోసమా? వైసీపీ నాయకుల కోసమా? వీసీ చర్యలపై కేంద్ర మానవ వనరుల శాఖకు ఫిర్యాదు చేస్తాం. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రయూనివర్సిటీని ప్రక్షాళన చేస్తాం అని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు.


ఇది కూడా చదవండి : Pawan Kalyan About Vizag: విశాఖపట్నం నాకు అన్నం పెట్టింది.. పవన్ ఎమోషనల్ స్పీచ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి