AP Assembly Elections: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. దేశంలోనే ప్రత్యేక ఆసక్తి కలిగిస్తున్న ఈ ఎన్నికలపై అందరి దృష్టి ఉంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగా.. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా పోటీ చేస్తుండగా ఇక్కడి ఎన్నికలు అత్యంత ఉత్కంఠ కలిగిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రలోభాల పర్వం సాగిస్తున్నాయి. కొంత ఇబ్బందిగా ఉన్న నియోజకవర్గాల్లో ఓటర్లకు భారీగా ముట్టజెప్పుతున్నారు. ఈ క్రమంలో పంపకాల్లో తేడాలు రావడంతో అక్కడక్కడ ఆందోళనలు చెలరేగుతున్నాయి. కీలక నాయకులైన పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబు, రోజా, లోకేశ్‌ పోటీ చేస్తున్న స్థానాల్లో ప్రలోభాలు, తాయిలాలు భారీగా జరుగుతున్నాయని సమాచారం.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: YS Jagan : ముదిరిపోయిన తొండ చంద్రబాబు.. ఆయన కుట్రలోనే కాంగ్రెస్‌ ఎంట్రీ: సీఎం వైఎస్‌ జగన్‌


 


పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన అతడు ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ సందర్భంగా గెలుపు కోసం జనసేనతోపాటు టీడీపీ, బీజేపీలు భారీగా ఓటర్లకు నగదు, కానుకలు అందిస్తున్నారని తెలుస్తోంది. పవన్‌కు మద్దతుగా అతడి అభిమానులు, వ్యాపారులు కూడా ఓటర్లకు చీరలు, నగదు, సామగ్రి తదితర అందిస్తున్నారని వినికిడి. ఇక పవన్‌ను ఈసారి పిఠాపురంలో కూడా ఓడించాలనే పట్టుదలతో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. వంగా గీతను బరిలోకి దింపడంతోపాటు ఆమెకు అండగా సీఎం జగన్‌ ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తానని భరోసా ఇవ్వడంతో పిఠాపురం వైసీపీ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. అయినా అతివిశ్వాసం పనికిరాదని భావించి ఓటర్లను మచ్చిక చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఓటర్లకు పంపకాలు మొదలుపెట్టారు. ఈ సమయంలో కొందరి మధ్య తేడాలు రావడంతో వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించడం కలకలం రేపింది.

Also Read: YS Sharmila Tears: వైఎస్ జగన్‌ వ్యాఖ్యలతో కలత.. కన్నీళ్లు పెట్టుకున్న వైఎస్‌ షర్మిల


 


ఇక నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరి, చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలో కూడా భారీగా లావాదేవీలు, తాయిలాలు, కానుకలు ఓటర్లకు పంచుతున్నారని సమాచారం. గత ఎన్నికల్లో ఓడిపోయిన లోకేశ్‌ ఈసారి గెలవాలనే పట్టుదలతో గట్టిగా పోరాడుతున్నారు. ఈ క్రమంలో ఓటర్లను తనవైపునకు తిప్పుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పోలింగ్‌కు ముందురోజు ఓటర్లకు, నాయకులకు మందు, విందు, కానుకలు అందించారని సమాచారం. మరోసారి లోకేశ్‌ను ఓడించేందుకు వైసీపీ భారీ వ్యూహం పన్నింది. అధికార పార్టీ కూడా పంపకాల్లో తగ్గేదేలా అంటొంది.


వైనాట్ కుప్పం అని అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అంటుండడంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు గుబులు ఏర్పడింది. గత ఎన్నికల్లోనూ తృటిలో ఓటమి నుంచి తప్పించుకున్న ఆయన ఈసారి ఓడిపోతారనే ప్రచారం జరిగింది. వైసీపీ ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించడంతో బాబు భారీ ఎత్తున ప్రలోభాలకు దిగారని సమాచారం. ఇక వైసీపీ కూడా బాబును ఓడించేందుకు అదేస్థాయిలో ప్రలోభాలు మొదలుపెట్టింది. మంత్రి ఆర్‌కే రోజా పోటీ చేస్తున్న నగరిలో, సినీ నటుడు బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురం ఇలా ప్రముఖులు పోటీ చేస్తున్న మరింత ఎక్కువగా పంపిణీలు జరుగుతున్నాయి. పంపకాల్లో తేడా రావడంతో కొన్ని చోట్ల ఓటర్లు తిరగబడ్డారు. కొన్నిచోట్ల ఆందోళనకు దిగారు.


పోలింగ్ ముందు రోజు ఓటర్లకు ప్రలోభాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. పంపిణీలో తేడా చూపించారంటూ పలుచోట్ల ఓటర్లు గొడవకు దిగుతున్నారు.


  • పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం కొండెవరంలో  ఓటుకి డబ్బులు ఇవ్వలేదని గ్రామస్తులు రోడ్డుపై ధర్నా చేపట్టారు. 

  • వైసీపీ నాయకులు డబ్బులు ఇస్తామని చెప్పి  ఇవ్వలేదంటూ సొంటివారి పాకల, ఇందిరా కాలనీ గ్రామస్తులు నిరసనకు దిగారు. స్థానిక వైసీపీ నాయకుడు దాదాపు 100 కుటుంబాలకు చెందిన డబ్బులు నొక్కేశాడని ఆరోపిస్తున్నారు.

  • అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని గ్రామాల్లో చీరల పంపిణీ వివాదానికి దారితీశాయి. ఆలమూరు మండలం పినపళ్ల గ్రామంలో ఓ పార్టీ నాయకులు తమకు చీరలు మాత్రమే ఇచ్చి డబ్బులు ఇవ్వలేదంటూ మహిళా ఓటర్లు ఆందోళనకు దిగారు. తమకు పంపిణీ చేసిన చీరలను నాయకులు ఇళ్ల వద్దకు వెళ్లి విసిరేశారు. 

  • వార్డుల్లో కొంతమందికి డబ్బులు ఇచ్చి మాకు ఇవ్వలేదని పిఠాపురం ప్రజలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఓ పార్టీ అభ్యర్థి కార్యాలయాన్ని ఓటర్లు చుట్టుముట్టారు. విషయం తెలుసుకుని కార్యాలయానికి వచ్చిన ఓటర్లను  పోలీసులు చెదరగొట్టారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter