పవన్ కళ్యాణ్‌కి ప్రాణహాని ఉంటే భద్రత కల్పిస్తామని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ఉండవల్లిలోని ప్రజావేదికలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..  'పవన్ కళ్యాణ్ తనకు ప్రాణహాని ఉందని అంటున్నారు. అలా మాట్లాడటం సరికాదు. నిజంగా ఆయనకు సమస్య ఉంటే భద్రత కల్పిస్తాం. ఎవరిపైనైనా అనుమానం ఉంటే చర్యలు తీసుకుంటాం.' అని అన్నారు. అంగరక్షకులు వద్దని తిప్పి పంపించింది ఆయనేనని.. పోలీసు వ్యవస్థపై అందరికీ నమ్మకం ఉండాలని చంద్రబాబు అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేరపూరిత రాజకీయాలను టీడీపీ ఎప్పుడూ ప్రోత్సహించలేదన్న ఆయన.. ఫ్యాక్షన్, నక్సలైట్లు, మత కలహాలను నియంత్రించామని.. గట్టి చర్యలు తీసుకోబట్టే రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఈ సందర్భంగా కేంద్రంపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. లీటరు  పెట్రోలు రూ.100కు చేరుతుందని, డాలరుతో రూపాయి మారకం విలువ పడిపోతుందని గతంలో చేప్పిన విషయాలను గుర్తుచేసిన ఆయన.. దేశం ఇంత గగ్గోలు పెడుతున్నా.. కేంద్రానికి ఏమీ పట్టదా? అని మండిపడ్డారు. మోదీ ప్రజల విశ్వసనీయత కోల్పోయారని, చెప్పే నీతులు, చేసే పనులకూ పొంతన లేదని ధ్వజమెత్తారు.


పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పోరాట యాత్రలో భాగంగా ఏలూరులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. తనపై హత్యకు కుట్ర జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముగ్గురు కలిసి హత్య చేసేందుకు ప్లాన్ చేశారని తనకు తెలిసిందన్నారు.