2018-19 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌కి తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తంచేస్తూ కేంద్రంపై గత కొద్ది రోజులుగా నిరసన వ్యక్తంచేస్తోన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. కేంద్రం తమకు నిధులు కేటాయించే వరకు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. గుంటూరు జిల్లా కాకాని వద్ద జవహార్ లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్శిటీ (జేఎన్‌టీయూ) కాలేజీ భవనానికి శనివారం శంఖుస్థాపన చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.


కాకానిలో చంద్రబాబు జేఎన్టీయూ విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ.. "ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఇతర రాష్ట్రాలకన్నా ముందున్న ఏపీ మున్ముందు ప్రపంచానికి నాయకత్వం వహిస్తుంది" అని అన్నారు. ఇదే సందర్భంగా ఏపీకి కేంద్రం నుంచి నిధుల కేటాయింపు అంశంపై స్పందిస్తూ.. " కేంద్రం ఏపీకి ఇవ్వాల్సి వున్న నిధులు ఇచ్చే వరకు తమ పోరాటం ఆగదు " అని స్పష్టంచేశారు.