దేశ వ్యాప్తంగా రానున్న రెండు మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఏడాది రుతుపవనాలు 17 రోజులు ముందుగానే దేశవ్యాప్తంగా విస్తరించినట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో మంగళవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ వారం చివరినాటికి దేశ వ్యాప్తంగా పలుచోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అల్పపీడన ద్రోణితో భారీ వర్ష సూచన


ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడినందున కొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలు కురిసే అవకాశంఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల పలు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. రానున్న రెండు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


సోమవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడడంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. శ్రీకాకుళం, విజయవాడ, విశాఖ, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం, చిత్తూరు, విజయనగరం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. కాగా పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని  రాష్ట్ర  విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు.