వెదర్ రిపోర్ట్: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో 48 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతూ వస్తోందని..దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. సముద్ర తీరం వెంబడి మూడు మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడే అవకాశాలు ఉన్నాయని తేల్చింది. తీర ప్రాంతంలో గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.
రైతాంగానికి కష్టాలు
గత నాలుగు రోజులుగా పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. తాజా హెచ్చరికలతో పరిస్థితి మరింత ఇబ్బంది కరంగా మారే అవకాశముంది. వ్యవసాయ పనులు ప్రారంభించిన రైతాంగానికి ఈ వర్షాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పొలాల్లో విత్తనాలు మొలకెత్తే దశలో భారీగా చేరుతున్న నీటితో అవి కుళ్లిపోవచ్చని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా తాజా పరిస్థితిని ఎదుర్కొనేందుకు అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.