తితిదే పేరిట వాట్సప్‌లో దందా..!
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసేవారు కేవలం 30 వేల రూపాయలు చెల్లిస్తే చాలు.. పోస్టును రిజర్వ్ చేసుకోవచ్చని చెబుతూ కొన్ని మోసపూరితమైన వాట్సప్ సందేశాలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ మొబైల్ మోసాలకు పాల్పడుతున్నవారు ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తి పేరుతో పాటు తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ పేరును కూడా వాడుకుంటున్నారు. అలాగే ఉద్యోగాల కోసం సంప్రదించాల్సిన నెంబర్లు కూడా వాట్సప్ సందేశాల్లో అందివ్వడంతో అనేకమంది నిరుద్యోగులు ఈ మోసాల బారిన పడుతున్నారు. ఇటీవలే ఈ దందా ప్రారంభించిన వ్యక్తులు పలు సందేశాల్లో ఉప ముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తి వ్యక్తిగత సెల్ ఫోన్ నెంబరుతో పాటు ఆయన పీఏ నెంబరు అని పేర్కొంటూ మరో నెంబరు కూడా సందేశంలో ఇవ్వడంతో.. ఈ ఉద్యోగాల గురించి ఆరా తీస్తూ..సీఎం నెంబరుకి కూడా ఫోన్లు రావడంతో అప్రమత్తమైన సీఎం ఆఫీసు ఒక ప్రకటన విడుదల చేయడం కూడా జరిగింది
ఇదే విషయంపై స్పందిస్తూ.. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ "తితిదేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబుతూ ప్రకటనలు ఇస్తూ, నా వ్యక్తిగత ఫోన్ నెంబరు కూడా జతచేసి వాట్సప్‌లో తప్పుడు సందేశాలు పంపుతున్నట్లు మాకు సమాచారం అందింది. ఈ ప్రకటనలపై విచారణ చేయించాలని కోరుతూ ఇప్పటికే రాయలసీమ రేంజ్ డీఐజీని కోరడం జరిగింది, పూర్తి స్థాయిలో విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించాను" అని పేర్కొన్నారు. తితిదేలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ప్రచారం చేస్తున్న వారు మెసేజ్‌లో తన ఫోన్ నెంబరును వాడటంపై తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ కూడా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.