జనసేన పార్టీ ఆధ్వర్యంలో శనివారం జరిగిన భూసేకరణ చట్ట పరిరక్షణ సదస్సులో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆయన ప్రశ్నించారు. "2013 భూసేకరణ చట్టానికి తూట్లు పొడిచిన మీరు ఒక రైతు సొంత భూమిలోకి వెళ్తే ఆయనపై రౌడీ షీట్ నమోదు చేస్తారా..? అమాయకులైన రైతులపై రౌడీషీట్లు తెరిచే మీరు మహిళా అధికారిపై చేయి చేసుకున్న చింతమనేని ప్రభాకర్ పై ఎందుకు రౌడీ షీట్ పెట్టలేదు. ఈ విషయంలో ఒక సీఎంగా మీదే తప్పు. అన్నం పెట్టిన రైతును భూమి నుండి గెంటేసిన మీరు.. పర్యావరణ విధ్వంసం జరిగేలా పారిశ్రామిక విధానం చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పశ్చిమ గోదావరి జిల్లాకి వెళ్తే పచ్చని భూములుండే డెల్టా ప్రాంతం కలుషితమైపోయింది. అందుకే భూదోపిడిని అడ్డుకోవాలని నిర్ణయించుకున్నాం. ఏపీ రైతుల కష్టాలు తీర్చడం కోసం మహారాష్ట్ర తరహాలో రైతు పోరాటం చేస్తాం" అని తెలిపారు. ప్రభుత్వం వైఖరి ఇలాగే ఉంటే.. ఇచ్ఛాపురం నుండి అనంతపురం వరకూ రైతులు ఒక ర్యాలీగా ఏర్పడి అమరావతికి వస్తారని పవన్ కళ్యాణ్ అన్నారు.


అలాగే రాజధాని అమరావతి పై కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు. సీఎం చెబుతున్న అమరావతి కేవలం పెయింటింగ్స్‌లో మాత్రమే కనిపిస్తుందని.. జనసేన అధికారంలోకి వస్తే పర్యవారణ హితంగా అమరావతిని నిర్మిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎన్నికల్లో మద్దతు కోసం వచ్చేటప్పుడు చంద్రబాబు 18 వందల ఎకరాలు భూమి ఉంటే రాజధాని నిర్మించవచ్చని అన్నారని.. కానీ ఆ తర్వాత రైతుల నడ్డి విరిచి లక్షల ఎకరాలు తీసుకుంటున్నారని విమర్శించారు.పాలకులు అడ్డగోలుగా భూమిని దోపిడి చేయడం మానుకోకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.