విజయనగరం: ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో భాగంగా  సోమవారం 3 వేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించారు. కొత్తవలసలోని దేశపాత్రునిపాలెం వద్ద జగన్ ఈ మార్క్ ను దాటారు. గత ఏడాది నవంబర్ 6న ఇడుపులపాయలో జగన్ ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. అప్పటి నుంచి విరామం లేకుండా పాదయాత్ర కొనసాగిస్తూ వచ్చిన జగన్.. ఈ మేరకు 3 వేల కి.మీ మార్క్ ను సాధించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

షర్మిల సరసన జగన్..
రాష్ట్ర చరిత్రలో సుదీర్ఘ పాదయాత్ర చేసిన వారిలో మాజీ సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు, వైఎస్ షర్మిల టాప్ -3 లిస్ట్ లో ఉన్నారు. 2004కు ముందు జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రచరిత్రలో మొదటిసారిగా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 2012 అక్టోబరు 18న కడప  ఇడుపులపాయలోని దివంత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద షర్మిలా మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించారు. 2014 ఎన్నికలకు ముందు అధికారమే లక్ష్యంగా చంద్రబాబునాయుడు కూడా పాదయాత్ర చేసారు. అయితే ఈ పాదయాత్రల్లో షర్మిల మాత్రమే మూడు వేల కి.మీ మార్క్ దాటగలిగారు. షర్మిల తర్వాత సుదీర్ఘ పాదయాత్ర చేసిన ఘనత జగన్ కే దక్కుతుంది.


పండగ చేసుకుంటున్న క్యాడర్..
తమ అధినేత సుదీర్ఘ పాదయాత్ర చేసి రికార్డు స్థాయిలో 3 వేల కి.మీ మైలురాయిని అధిగమించడంపై వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ నేత తన పాదయాత్రతో రికార్డు సృష్టించిన నేపథ్యంలో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సందర్భంగా జగన్ 3000 కి.మీ. పైలాన్ ను ఆవిష్కరించి.. ఓ మొక్కను నాటారు. అనంతరం వైసీపీ కార్యకర్తలు తీసుకొచ్చిన కేక్ ను కట్ చేసిన జగన్.. తన యాత్రను కొనసాగించారు.