వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 2500కి.మీ. పూర్తిచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా పులసపూడి వంతెన వద్ద జగన్ ఈ మైలురాయిని చేరారు. ఇందుకు గుర్తుగా అక్కడ ఓ మొక్కను జగన్ నాటారు. కాగా గతేడాది నవంబర్ 6న ఇడుకులపాయలో జగన్ ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమవడం తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 69వ జయంతి రోజున ఈ మైలురాయి దాటడం విశేషం. వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా తూ.గో. జిల్లాలో పాదయాత్రలో ఉన్న జగన్ వైఎస్‌ఆర్‌కు నివాళులర్పించారు. పార్టీ నేతలు, కార్యకర్తల సమక్షంలో కేట్‌ కట్‌ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అటు వైఎస్సార్‌ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి, వైఎస్‌ షర్మిలతో పాటు పలువురు కుటుంబ సభ్యులు వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.


హ్యాపీ బర్త్ డే నాన్న: వైఎస్ జగన్ ట్వీట్


నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 69వ జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన ట్విటర్‌లో స్పందించారు. 'వైఎస్సార్‌ జయంతి రోజే నేను చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 2500 కిలోమీటర్ల అరుదైన మైలురాయిని చేరుకోనుండటం కేవలం యాధృచ్ఛికమే కాదు, ఏపీ ప్రజలతో పాటు వైఎస్సార్‌ ఆశీస్సులు కూడా నాకు ప్రతిబింబించేలా ఉంది. స్వర్గం నుంచి నాన్న వైఎస్సార్‌ ఆశీర్వదించారు. హ్యాపీ బర్త్‌డే నాన్న. ఎల్లప్పుడూ మాకు అండగా ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు’ అని వైఎస్‌ జగన్‌ ఉద్వేగభరితంగా ట్వీట్‌ చేశారు.