అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రపదేశ్‌ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావుతో భేటీ కానున్నారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ని మర్యాదపూర్వకంగా కలవనున్న జగన్.. విజయవాడలో జరగనున్న తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాల్సిందిగా ఆయన్ను ఆహ్వానించనున్నారు. పార్టీ శాసనసభా పక్ష సమావేశం ముగిసిన అనంతరం జగన్‌ హైదరాబాద్‌ వెళ్లనున్నారు. 


మొత్తం 175 అసెంబ్లీ స్థానాలున్న ఏపీలో వైఎస్సార్సీపీ 151 అసెంబ్లీ స్థానాలు గెల్చుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. పిన్న వయసులోనే జగన్ సాధించిన ఈ అద్భుత విజయం చూసి జాతీయ నేతలు సైతం ఆశ్చర్యపోతున్నారు. దీంతో అన్నివైపులు, అన్నివర్గాల నుంచి వైఎస్ జగన్‌కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.