మళ్లీ సొంత జిల్లాకు రానున్న వైఎస్ జగన్
నవంబర్లో కడప జిల్లాలో పాదయాత్ర చేయనున్న వైఎస్ జగన్
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నేటితో 262వ రోజుకు చేరుకుంది. నేటి ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఇవాళ ఉదయం వైఎస్ జగన్ విశాఖ ఈస్ట్ నియోజకవర్గంలోని చనగదిలి క్యూ-1 ఆస్పత్రి కూడలి నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు. మధ్యాహ్నం భోజనం సమయానికి చనగదిలి నుంచి రామకృష్ణాపురం, శ్రీకృష్ణ పురం, ఫైనాపిల్ కాలనీ, దరపాలెం వరకు వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతుంది. దరపాలెంలో లంచ్ బ్రేక్ అనంతరం మధ్యాహ్నం 2.45 గంటలకు వైఎస్ జగన్ పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి అడవివరం, లండ గరువు క్రాస్ మీదుగా దువ్వపాలెం వరకు వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తూ వెళ్లి ఇవాళ రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకోనున్నారు.
ఇదిలావుంటే, ఈ నెల 17 నుంచి గడప గడపకు నవరత్నాలు కార్యక్రమం పేరిట వైఎస్సార్సీపీ ప్రజల్లోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. నవంబర్ 5 వరకు ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొని ఆ తర్వాత కడప జిల్లాలో జరగనున్న పాదయాత్ర కోసం వైఎస్ జగన్ మళ్లీ తన సొంత జిల్లాకు చేరుకోనున్నారని తెలుస్తోంది.