శ్రీవారి సేవలో వైఎస్ జగన్
ప్రజా సంకల్ప యాత్రకు బయలుదేరే ముందు వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం తెల్లవారుజామున నైవేద్య సమయంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. ఆతరువాత రంగనాయకులు మండపం చేరుకొని వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంట ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు నేతలు ఉన్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీవారి సేవ అనంతరం అక్కడి నుంచి శారదా పీఠం గెస్ట్ హౌస్ కు చేరుకొని శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. తెలుగువారు ఎక్కడున్నా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయం కావాలని శ్రీవారి కోరుకున్నట్లు వైఎస్ జగన్ తెలిపారు. ప్రజా సంకల్ప యాత్ర నవంబర్ 6 వ తారీఖున వైఎస్సార్ కడప జిల్లాలోని ఇడుపులపాయ నుంచి ప్రారంభమై, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగుస్తుంది.