అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో చిన్న వయసులోనే రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతున్న రెండో వ్యక్తిగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం జగన్ వయసు 46 ఏళ్లు. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా గెలిచిన వైఎస్ జగన్ నవ్యాంధ్రప్రదేశ్‌కి ఆయనే పిన్నవయస్సు కలిగిన ముఖ్యమంత్రి. అలా కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే, 1995లో నారా చంద్రబాబు నాయుడు 45 ఏళ్ల వయస్సులోనే ఆనాడు ముఖ్యమంత్రి అయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పిన్నవయసులో ముఖ్యమంత్రి అయిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జాబితాను కాసేపు పక్కనపెడితే, దేశంలో చాలామంది నేతలను చిన్న వయసులోనే ముఖ్యమంత్రి పదవి వరించింది. అలా చిన్న వయస్సులోనే ముఖ్యమంత్రి అయిన వారిలో 1967లో అప్పటి కేంద్రపాలిత ప్రాంతం పాండిచ్చేరి ( ప్రస్తుతం పుదుచ్చేరి) ముఖ్యమంత్రి హసన్ ఫరూక్ మారికర్ ముందు వరుసలో వున్నారు. 30 ఏళ్ల వయస్సులోనే ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఆయన ఆ తర్వాత మూడు పర్యాయాలు పాండిచ్చెరికి ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. 


ఆ తర్వాత 2016లో అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఎన్నికైన పెమాఖండూ కూడా పిన్న వయసు కలిగిన ముఖ్యమంత్రుల జాబితాలో నిలిచారు. పెమాఖండూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు ఆయన వయసు 36 ఏళ్లే కావడం విశేషం. అలాగే మేఘాలయ ముఖ్యమంత్రిగా ఉన్న కనరాడ్‌ సంగ్మా కూడా 40 ఏళ్లకే ఆ పదవిని చేపట్టారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ 43 ఏళ్లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. యూపీ సీఎంగా ఉన్న యోగి ఆదిత్యనాథ్‌ 44 ఏళ్లకు పగ్గాలు చేపట్టారు.