శ్రీకాకుళం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నేడు 316వ రోజు యాత్ర ప్రారంభమైంది. శుక్రవారం రాత్రి బస చేసిన ఎచ్చెర్ల నియోజకవర్గంలోని ఫరీదు పేట నైట్‌ క్యాంప్‌ నుంచే వైఎస్ జగన్ శనివారం తన పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి జగన్ కుశాలపురం, బైపాస్‌ జంక్షన్‌ మీదుగా గవర్నమెంట్‌ పాల్‌టెక్నిక్‌ కాలేజ్‌ సెంటర్‌ చేరుకుంటారు. అక్కడ వైఎస్‌ జగన్‌ భోజన విరామం తీసుకున్న అనంతరం మధ్యాహ్నం 02:45కి తిరిగి తన పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచే జగన్ పాదయాత్ర శ్రీకాకుళం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. 


శ్రీకాకుళం నియోజకవర్గంలోకి ప్రవేశించిన అనంతరం గుజరాతి పేట మీదుగా శ్రీకాకుళం 7 రోడ్స్‌ జంక్షన్‌ వరకు జగన్ పాదయాత్ర కొనసాగుతుంది. శ్రీకాకుళం 7 రోడ్స్‌ జంక్షన్‌ వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు వైఎస్ జగన్ రాకకోసం భారీ బహిరంగ సభా వేదికను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అక్కడ నేటి సాయంత్రం జరిగే భారీ బహిరంగ సభలో జగన్ పార్టీ కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి ప్రసగించనున్నారు. ఈ మేరకు వైఎస్ జగన్ 316వ రోజు ప్రజాసంకల్ప యాత్రకు సంబంధించిన షెడ్యూల్‌పై వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.