స్కూల్ విద్యార్థితో చంద్రబాబుని పోల్చుతూ వైఎస్ జగన్ సెటైర్లు !
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సెటైర్స్
అవకాశం చిక్కినప్పుడల్లా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఏదో ఓ విధంగా సెటైర్లు వేస్తూ తనలోని హాస్య చతురతను చాటుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. తాజాగా నిన్న తూర్పు గోదావరి జిల్లా రాజోలులో జరిగిన ప్రజా సంకల్ప యాత్రలోనూ చంద్రబాబుపై జగన్ తనదైన స్టైల్లో సెటైర్లు వేసిన అక్కడి జనసందోహాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఆయన చంద్రబాబును పరీక్ష హాలులో పరీక్ష రాస్తోన్న ఓ విద్యార్థితో పోల్చుతూ మాట్లాడారు.
అనగనగా ఒక విద్యార్థి ఉన్నాడు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిరి. ఆ విద్యార్థి వార్షిక పరీక్షలు రాయడానికి వెళ్లాడు. మూడు గంటల పరీక్షలో రెండున్నర గంటలు ఏమీ రాయకుండా కూర్చున్న ఆ విద్యార్థి... మరో గంట సేపయితే పరీక్ష ముగుస్తుందనగా మాస్టారు దగ్గరికొచ్చి.. 'సార్.. నాకు ఇంకో మూడు గంటలు టైమివ్వండి పరీక్ష బాగా రాస్తాను' అని అన్నాడు. విద్యార్థి తీరు చూసి విస్తుపోయిన ఆ మాస్టారు.. 'అయినా ఇంతసేపు పరీక్ష రాయకుండా ఏం చేశావు ? ఇంతసేపు రాయలేనిది ఇప్పుడెలా రాస్తావు' అని అడిగారట. ఆ మాస్టారు అడిగిన ప్రశ్నకు విద్యార్థి స్పందిస్తూ 'సార్, మీరు నెల టైమిస్తే స్టేట్ ఫస్ట్ వచ్చేలా పరీక్ష రాస్తా, ఐదు నెలలు టైమిస్తే ప్రపంచంలోనే ఫస్టొచ్చేలా రాస్తా..' అని చెప్పాడట. 2020 కల్లా దేశంలో, 2050 కల్లా ప్రపంచంలో ఏపీని నంబర్ వన్ చేస్తా అని చెప్పుకుంటున్న చంద్రబాబు ఈ కథలోని విద్యార్థి అయితే, మాస్టారుగా ఆయన్ని నిలదీసేది ప్రజలే అంటూ విద్యార్థి-మాస్టారు కథలోని నీతిని వివరించారు వైఎస్ జగన్