హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీనే అధిక స్థానాలు గెల్చుకుని ఏపీలో అధికారంలోకి వస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామా రావు అన్నారు. ఏపీలో చంద్రబాబు ఓటమి చెందడం ఖాయం అని అభిప్రాయపడిన కేటీఆర్.. ఏపీలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే, రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల హక్కులు సాధించుకోవడానికి మార్గం సుగుమమవుతుందని అన్నారు. శనివారం టీఆర్ఎస్ శాసనసభా పక్ష కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన కేటీఆర్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేంద్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, టీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణపై అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీని శాసిద్దాం.. తెలంగాణ హక్కులను సాధించుకుందాం అనే నినాదంతోనే ఈసారి లోక్ సభ ఎన్నికల్లో పోటీకి వెళ్లనున్నట్టు కేటీఆర్ స్పష్టంచేశారు. తెలంగాణలో 16 ఎంపీ స్థానాలు గెల్చుకుంటే, ఢిల్లీలో తమ హక్కుల సాధన పెద్ద కష్టమైన పనేమీ కాదని కేటీఆర్ అన్నారు. అంతేకాకుండా లోక్ సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో టీఆర్ఎస్ నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. 


ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ఓటమి తప్పదని చెబుతూ ఈసారి వైఎస్ జగన్ అధికారంలోకి వస్తారని అశాభావం వ్యక్తంచేశారు. ఇప్పటికే తాను వైఎస్ జగన్ ని కలిసి మాట్లాడనని, అవసరమైతే భవిష్యత్‌లో సందర్భాన్నిబట్టి కేసీఆర్ సైతం ఆయనను కలుస్తారని కేటీఆర్ తేల్చిచెప్పారు.