100 మందికిపైగా ప్రయాణికులతో ల్యాండ్ అవుతున్న విమానానికి తప్పిన ప్రమాదం
అనుకోని ప్రమాదంతో హడలిపోయిన ప్రయాణికులకు అసలు బయట ఏం జరుగుతుందో అర్థం కాలేదు.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో బుధవారం రాత్రి ఘోర ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చిన ఇండిగో విమానం హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతుండగా రన్‌వైపైనే విమానం టైర్ పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని పసిగట్టిన ఎయిర్ పోర్టు సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. అప్రమత్తమైన పైలట్ సైతం విమానం అదుపు తప్పకుండా జాగ్రత్త పడటంతో ప్రయాణికులు అంతా సురక్షితంగా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ విమానంలో 100 మందికిపైగా ప్రయాణికులు వున్నట్టు తెలుస్తోంది. ప్రయాణికుల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా కూడా వున్నారు.
అనుకోని ప్రమాదంతో హడలిపోయిన ప్రయాణికులకు అసలు బయట ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ప్రమాదం కారణంగా రన్‌వే పై కాస్త గందరగోళం నెలకొని వుండటంతో విమానం సిబ్బంది ప్రయాణికులు కిందికి దిగేందుకు డోర్లు తెరవలేదు. ఈ క్రమంలో ప్రయాణికులు, ఇండిగో విమానం సిబ్బందికి మధ్య కొంత వాగ్వాదం కూడా చోటుచేసుకుంది. ఇదిలావుంటే, అదృష్టవశాత్తుగా ఈ ప్రమాదం బారి నుంచి విమానం సిబ్బంది సహా ప్రయాణికులం అందరం సురక్షితంగా బయటపడ్డామని ఎమ్మెల్యే రోజా తన ఫేస్‌బుక్ ఎకౌంట్ ద్వారా ఓ వీడియో సందేశాన్ని సైతం పోస్ట్ చేశారు