టీడీపీకి MLA Roja ఘాటు కౌంటర్
ఏపీలో మద్యం ధరలను పెంచి ప్రభుత్వం ఆదాయం పెంచుకోవాలని చూస్తోందని టీడీపీ నేతలు విమర్శిస్తున్న నేపథ్యంలో ఈ వివాదంపై ఏపీఐఐసి చైర్మన్ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తనదైన శైలిలో స్పందించారు.
విజయవాడ: ఏపీలో మద్యం ధరలను పెంచి ప్రభుత్వం ఆదాయం పెంచుకోవాలని చూస్తోందని టీడీపీ నేతలు విమర్శిస్తున్న నేపథ్యంలో ఈ వివాదంపై ఏపీఐఐసి చైర్మన్ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తనదైన శైలిలో స్పందించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేదించాలనే లక్ష్యంతోనే సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మద్యం ధరలు పెంచారని.. అలా మద్యం ధరలు పెంచడం వల్ల మద్యానికి బానిసైన పేదవాడే మద్యానికి దూరం అవుతారని అన్నారామె. పేదవాడికి మద్యాన్ని దూరం చేస్తేనే.. వాళ్ల ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి బాగుంటుందనే లక్ష్యంతో ఎన్నికలకు ముందు ఇచ్చిన తన హామీని నేరవేరుస్తూ సీఎం జగన్ ముందుకు సాగుతున్నారని రోజా పేర్కొన్నారు.
Also read : టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్‌పై కేసు నమోదు
చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తే.. సీఎం జగన్ అధికారంలోకి వచ్చారా దశలవారీగా మద్యపానం నిషేధానికి కృషి చేస్తున్నారని రోజా అభిప్రాయపడ్డారు. '' సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 44 వేల బెల్టుషాపులు, 40% బార్లు, 20% వైన్ షాపులు తొలగించారు'' అని పలు గణాంకాలను వెల్లడించారు. రాష్ట్రానికి ఆదాయ వనరు అయిన మద్యాన్ని సీఎం జగన్ ఆదాయంగా భావించకుండా దానిని నిషేధించి పేదోడికి మేలు చేస్తున్నారని ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు.
Also read : మే 7 నుంచి.. కరోనా లక్షణాలు లేని వారికి మాత్రమే
కరోనావైరస్ నివారణలో ఏపీ సర్కార్ విఫలమైందని టీడీపి చేస్తోన్న విమర్శలపైనా ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా స్పందించారు. ఓవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరోనావైరస్ నివారణ కోసం తీవ్రంగా కృషి చేస్తున్న తీరును ప్రధాని మోదీ, పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభినందిస్తోంటే.. మరోవైపు చంద్రబాబు, టీడీపీ నేతలు మాత్రం ఏసీ గదుల్లో కూర్చొని విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పచ్చకామెర్లు వచ్చినోళ్లకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్టుగా... వాళ్లు లోపాలు ఎత్తి చూపేందుకే ప్రయత్నిస్తున్నారు కనుక వాళ్లకు అలాగే కనిపిస్తోందని ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు.
సీఎం జగన్ మిగతా రాష్ట్రాల మాదిరిగా తక్కువ పరీక్షలు చేసి తమ రాష్ట్రంలో కరోనా లేదని చెప్పుకునే ప్రయత్నం చేయకుండా.. వీలైనంత ఎక్కువ మందికి కరోనా పరీక్షలు చేయించి రాష్ట్రంలో ఎవ్వరికీ కరోనా లేకుండా చూసేందుకు పాటుపడుతున్నారని రోజా అన్నారు. ఏదేమైనా మద్యం ధరలు పెంచితే టీడీపీ నేతలు ఎందుకు బాధపడుతున్నారో తనకు అర్థం కావడం లేదని ప్రశ్నించారామె. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..