ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం ఏప్రిల్‌ 6న రాజీనామాలు సమర్పించిన ఐదుగురు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు.. వాటి ఆమోదం కోసం నేడు లోక్‌సభ స్పీకర్‌ను కలవనున్నారు. న్యూఢిల్లీలో బుధవారం ఉదయం 11 గంటలకు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను కలవనున్నారు. తమ రాజీనామాలను వెంటనే ఆమోదించాలని స్పీకర్‌ను మరోసారి ఎంపీలు కోరనున్నారు. ప్రత్యేక హోదా కంటే ఏదీ ముఖ్యం కాదంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు. కాగా వైసీపీ ఎంపీల రాజీనామాలపై ఈ రోజు స్పీకర్‌ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


బడ్జెట్‌ సమావేశాల చివరిరోజు రాజీనామాలు చేసిన ఎంపీలు.. ఏపీ భవన్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. మే 29వ తేదీన లోక్‌‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్‌ను కలిసి తాము ఎలాంటి ఒత్తిడితో రాజీనామాలు చేయలేదని.. స్వఛ్చందంగానే చేశామని చెప్పారు. అయితే రాజీనామాల విషయంలో పునరాలోచించుకొని జూన్ 6వ తేదీన మరోసారి వచ్చి కలవాలని వైసీపీ ఎంపీలకు స్పీకర్ కోరారు. ఈ క్రమంలోనే నేడు వైసీపీ ఎంపీలు తాము చేసిన రాజీనామాలను వెంటనే ఆమోదించాలని స్పీకర్‌ను విజ్ఞప్తి చేయనున్నారు.