2019 ఎన్నికల్లో వారికే తమ మద్దతు : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్
2019 ఎన్నికల్లో ఎవరికి తమ మద్దతు ఇవ్వనున్నారనే అంశంపై మరోసారి స్పష్టమైన ప్రకటన చేసిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి
2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు పూర్తి మెజారిటీతో వైఎస్సార్సీపీకే పట్టం కడతారని విశ్వాసం వ్యక్తంచేశారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఏమీ సాధించని నేతగా పేరు తెచ్చుకున్న చంద్రబాబుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, అందుకే తమ గెలుపుకు ఎలాంటి ఢోకా లేదని వైఎస్ జగన్ స్పష్టంచేశారు. చంద్రబాబు సొంతం చేసుకున్న అపఖ్యాతే ఆయనను పదవికి దూరం చేస్తుందని జగన్ తేల్చిచెప్పారు. పాలనలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ప్రజలకు ఏమీ సాధించని ముఖ్యమంత్రిగా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వైఎస్ జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులను పూర్తిగా మార్చివేయనున్నట్టు ఈ సందర్భంగా జగన్ అభిప్రాయపడ్డారు.
2019 లోక్ సభ ఎన్నికల్లో వైఎస్సార్పీ జాతీయ స్థాయిలో ఏ పార్టీకి మద్దతు ఇస్తుందనే ప్రశ్నకు జగన్ స్పందిస్తూ.. ప్రధానమంత్రి మోదీనా లేక రాహుల్ గాంధీనా అనేది తమకు ముఖ్యం కానేకాదని అన్నారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదాను ఎవరు ఇస్తే వారికే వైఎస్సార్సీపీ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా వైఎస్ జగన్ తేల్చిచెప్పారు. అంతేకాకుండా ఎప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి ప్రత్యేకహోదాతోనే సాధ్యమవుతుందని జగన్ తెలిపారు.