Adani-Hindenburg Issue: ఆగని పతనం, ప్రపంచ కుబేరుల జాబితాలో 30వ స్థానానికి పడిపోయిన గౌతమ్ అదానీ
Adani-Hindenburg Issue: హిండెన్‌బర్గ్ నివేదిక ప్రభావం అదానీ గ్రూప్‌పై ఇంకా కొనసాగుతూనే ఉంది. అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ఇంకా పతనమౌతూనే ఉన్నాయి. ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీ ఇప్పుడు 30వ స్థానానికి పడిపోయారు. ఆ వివరాలు మీకోసం..
కేవలం నెలరోజుల క్రితం గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో మూడవ స్థానంలో ఉన్నారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక ప్రతికూల ప్రభావంతో అదానీ సంపద ఎంతగా పతనమైందంటే..3 నుంచి 30వ స్థానంలోకి పడిపోయారు. నెలరోజుల వ్యవధిలో అదానీ కంపెనీ సంపద ఎంత క్షీణించిందనే వివరాలు తెలుసుకుందాం.
పోర్టులు, ఎయిర్‌పోర్ట్స్, క్రూడ్ ఆయిల్, విద్యుత్, సిమెంట్, డేటా సెంటర్లు వంటి అన్ని రంగాల్లో వ్యాపారాన్ని విస్తరించిన అదానీ గ్రూప్ షేర్లు నెలరోజుల్లో భారీగా పతనమైపోయాయి. అదానీ గ్రూప్‌కు చెందిన 10 కంపెనీల మార్కెట్ వాటా ఏకంగా 12.06 లక్షల కోట్లు క్షీణించింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక జనవరి 24వ తేదీన వెలువడింది. ఇందులో అదానీ గ్రూప్‌పై షేర్ల విలువల్లో అవకతవలకు, ఎక్కౌంటింగ్ ఫ్రాడ్, నకిలీ విదేశీ కంపెనీలు సృష్టించడం, మనీ లాండరింగ్ వంటి తీవ్ర ఆరోపణలున్నాయి. హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణల్ని అదానీ గ్రూప్ అంతా అబద్ధమని..అవాస్తవాలని కొట్టిపారేసినా..మార్కెట్‌పై ప్రభావం కన్పించలేదు. షేర్ల పతనం నెలరోజుల్నించి కొనసాగుతూ వస్తోంది.
అదానీ ట్రాన్స్‌మిషన్ మార్కెట్ వాటాలో జనవరి 24 నుంచి ఇప్పటి వరకూ 74.21 శాతం తగ్గుదల నమోదైంది. అటు గ్రూప్ ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజస్ వాటా దాదాపుగా 62 శాతం పడిపోయింది. అదానీ పవర్, అదానీ విల్మర్‌తో పాటు అదానీ సిమెంట్ కంపెనీలైన అంబూజా సిమెంట్స్, ఏసీసీ సిమెంట్స్ మార్కెట్ వాటా కూడా భారీగా తగ్గిపోయింది. మరోవైపు అదానీ గ్రూప్ ఇటీవల టేకోవర్ చేసిన మీడియా కంపెనీ ఎన్డీటీవీ, అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ వాటా కూడా భారీగా తగ్గిపోయింది.
గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద గురించి పరిశీలిస్తే 120 బిలియన్ డాలర్ల నుంచి 40 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అంటే అదానీ ఆదాయం ఏకంగా 80 బిలియన్ డాలర్లు పడిపోయింది. మూడింట రెండు వంతులు క్షీణించింది. అదానీ సంపదలో తగ్గుదలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ మరోసారి దేశంలోనే కుబేరుడిగా అవతరించారు. అంబానీ ఇప్పుడు 81.7 బిలియన్ డాలర్లతో ప్రపంచ కుబేరుల జాబితాలో 10వ స్థానంలో నిలిచారు.
అమెరికా మాజీ ఆర్ధిక మంత్రి, హార్వర్డ్ యూనివర్శిటీ మాజీ అధ్యక్షుడు ల్యారీ సమ్మన్స్ అదానీ కేసును అమెరికాకు చెందిన ఎన్రాన్ కార్పొరేషన్‌తో పోల్చారు. అదానీ కేసు మరో భారతీయ ఎన్రాన్ వంటిదన్నారు. ఆ కంపెనీపై కూడా షేర్ల విలువ, కంపెనీ ఆదాయాన్ని ఎక్కువచేసి చూపించిన ఆరోపణలు రావడంతో భారీగా పతనమైంది.
షేర్ల ధరల్ని కృత్రిమంగా పెంచి చూపించారనే ఆరోపణలు
హిండెన్ బర్గ్ సంస్థ సమర్పించిన పరిశోధనా నివేదికలో అదానీ గ్రూప్‌పై షేర్ల ధరల్ని కృత్రిమంగా పెంచి చూపించిన ఆరోపణలున్నాయి. అదానీ కుటుంబానికి చెందిన ట్రస్ట్ లింక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ద్వారా ఓపెల్ ఇన్వెస్ట్‌మెంట్ ఏర్పడింది. అయితే ఓపెన్ కొనుగోలు చేసిన షేర్లపై తమకు నియంత్రణ లేదని అదానీ గ్రూప్ జనవరి 27వ తేదీన అంటే నివేదిక వెలువడిన మూడ్రోజుల తరువాత తెలిపింది.
ఈ వ్యవహారంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీను టార్గెట్ చేసింది. అదానీ గ్రూప్ వేగంగా ఎదగడం, విస్తరించడంలో మోదీ ప్రభుత్వ సహకారం ఉందని ఆరోపించింది.
ఎవరీ వినోద్ అదానీ
గౌతమ్ అదానీ పెద్దన్నయ్య వినోద్ అదానీ పేరు కూడా ఈ వివాదంలో విన్పిస్తోంది. హిండెన్‌బర్గ్ నివేదికలో వినోద్ అదానీపై నకిలీ షెల్ కంపెనీల ఏర్పాటు ఆరోపణలున్నాయి. హిండెన్‌బర్గ్ నివేదిక ప్రకారం వినోద్ అదానీ మారిషస్, సైప్రస్ సహా ఇతర కరీబియన్ దేశాల్లోని షెల్ కంపెనీల బాధ్యతలు చూసుకుంటున్నారు. అదానీ గ్రూప్‌తో ఈ కంపెనీలకు రహస్య లావాదేవీలున్నాయి.
వినోద్ అదానీ..తమకు చెందిన ఏ లిస్టెడ్ కంపెనీలోనూ కీలక పదవిలో లేరని అదానీ గ్రూప్ తెలిపింది. అంతేకాకుండా ఏ విధమైన డైలీ యాక్టివిటీస్ నిర్వహించడం లేదని వెల్లడించింది. గత నెలలోనే అదానీ గ్రూప్ ఇష్యూ చేసిన ఎఫ్‌పీవోలో 20 వేల కోట్లు సమీకరించినా..ఎఫ్‌పీవోను కంపెనీ రద్దు చేసింది.
Also read: Best Sedan 2023: ఈ సెడాన్ కారు హ్యాచ్‌బ్యాక్ కంటే మెరుగైంది.. ధర కేవలం 6 లక్షలు! ఫీచర్లు అదుర్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook