Health Insurance Premium: హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం భారీగా తగ్గే అవకాశం.. జీఎస్టీ సమావేశంలో కీలక నిర్ణయం
Health Insurance Premium: జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఇన్సూరెన్స్ పై జీఎస్టీ నిర్ణయం వాయిదా పడింది. దీనిపై వచ్చే జీఎస్టీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనే అవకాశం ఉంది.
GST Council: జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆరోగ్య బీమా, జీవిత బీమాపై జీఎస్టీ తగ్గింపై కౌన్సిల్ లో నిర్ణయం వాయిదా పడింది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆరోగ్య, జీవిత బీమా, బీమా ప్రీమియంలపై జీఎస్టీ రేటును తగ్గించేందుకు ఏకాభిప్రాయం కుదిరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం బీమా ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ విధిస్తుండగా, తగ్గించేందుకు అంగీకరించారు. అయితే దీనిపై వచ్చే జీఎస్టీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నేత్రుత్వంలో జరిగిన 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై విస్త్రుత చర్చ జరిగింది.
పన్ను రేటును హేతుబద్ధం చేసేందుకు కేంద్రం, రాష్ట్రాల పన్ను అధికారుల కమిటీ (ఫిట్‌మెంట్ కమిటీ) సోమవారం జీఎస్టీ కౌన్సిల్ ముందు నివేదికను సమర్పించింది. ఇది జీవితం, ఆరోగ్యం, రీఇన్స్యూరెన్స్ ప్రీమియంలపై GST మినహాయింపు డేటాతోపాటు విశ్లేషణను అందిస్తుంది. "ఆరోగ్య, జీవిత బీమాపై GST రేటు తగ్గింపుపై మండలిలో ఏకాభిప్రాయం కుదిరింది. అయితే తదుపరి కౌన్సిల్ సమావేశంలో విధివిధానాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన, రాష్ట్ర మంత్రుల సమక్షంలో జీఎస్టీ కౌన్సిల్ 54వ సమావేశం ప్రస్తుతం ఢిల్లీలో కొనసాగుతోంది. జీఎస్టీకి సంబంధించిన విషయాల్లో అత్యున్నత నిర్ణయం తీసుకునే సంస్థ ఇదే.
జీఎస్టీ తగ్గింపుపై కుదిరిన ఏకాభిప్రాయం:
నెలవారీ జీఎస్టీ వసూళ్లు పెరగడం వల్ల పన్ను చెల్లింపుదారులకు అనుకూలమైన చర్యలకు అవకాశం ఉన్నందున చాలా రాష్ట్రాలు బీమా ప్రీమియం రేట్లను తగ్గించేందుకు అనుకూలంగా ఉన్నాయని వర్గాలు తెలిపాయి. జీఎస్టీ రేట్లు తగ్గిస్తే ప్రీమియం మొత్తం తగ్గడంతో కోట్లాది మంది పాలసీదారులకు ప్రయోజనం చేకూరుతుంది.
గతంలో బీమా ప్రీమియంపై సర్వీస్ ట్యాక్స్:
జీఎస్టీ రాకముందు బీమా ప్రీమియంలపై సర్వీస్ ట్యాక్స్ విధించేవారు. 2017లో జీఎస్టీ అమలులోకి వచ్చినప్పుడు, జీఎస్టీ విధానంలో సేవాపన్ను చేర్చారు. 023-24 ఆర్థిక సంవత్సరంలో, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ ద్వారా కేంద్రరాష్ట్రాలు రూ. 8,262.94 కోట్లు వసూలు చేయగా, ఆరోగ్య రీఇన్సూరెన్స్ ప్రీమియంలపై రూ. 1,484.36 కోట్లు జీఎస్టీగా వసూలు చేశాయి.
బీమా ప్రీమియం విషయంలో గందరగోళం :
పార్లమెంటులో చర్చ సందర్భంగా బీమా ప్రీమియంపై పన్ను విధించే అంశం ప్రస్తావనకు వచ్చింది. ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలను జీఎస్టీ నుంచి మినహాయించాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే . కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఈ విషయంపై సీతారామన్‌కు లేఖ రాశారు. పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య గత నెలలో రేట్ల హేతుబద్ధీకరణపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం సమావేశంలో బీమా ప్రీమియం సమస్యను లేవనెత్తారు. తదుపరి డేటా విశ్లేషణ కోసం కేసు 'ఫిట్‌మెంట్' కమిటీకి సూచించింది.