Car Maintenance Tips in Telugu: ఎవరైనా సరే జీవితంలో మొట్టమొదటిసారిగా కొన్న వాటిపై ఎంతో మమకారం పెంచుకుని ఉంటారు. అది ఇల్లు అయినా సరే లేదంటే కారు అయినా సరే... వాటిపై ఒకరకమైన ఇష్టాన్ని, ప్రేమను పెంచుకుంటుంటారు. ఆ ఇష్టం ఏ రేంజులో ఉంటుందంటే.. ఒకానొక దశలో వాటిని అమ్మేయాల్సి వచ్చినా అందుకు వారి మనసొప్పుకోదు. ఉదాహరణకు కారు పాతది అయింది కదా అని తీసేద్దాం అనుకున్నా అందుకు మనసొప్పుకోదు. ఎందుకంటే ఆ కారు బాగా మైలేజ్ ఇస్తుందనో లేదో కలిసొచ్చింది అనే ఫీలింగ్ ఆ కారును అమ్మేయకుండా చేస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే, అలాగని ఆ పాత కారును అలాగే మెయింటెన్ చేయాలంటే దాని ఇంజన్ లైఫ్, కారు కండిషన్ దెబ్బతినకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. కారు డైలీ మెయింటెనెన్స్ నిర్లక్ష్యం చేస్తే ఆ తరువాతి కాలంలో మరమ్మతులు, బ్రేక్‌డౌన్స్, ఎక్కువ మెయింటెనెన్స్, మైలేజ్ తగ్గిపోవడం వంటి సమస్యలతో సతమతం అవ్వాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో పాత కార్ల కండిషన్ దెబ్బతినకుండా, మైలేజ్ తగ్గకుండా, అలాగే సేఫ్టీ విషయంలోనూ డోకా లేకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. 


1) టైర్ల విషయంలో జాగ్రత్త వహించాలి : కారు ప్రయాణించాలంటే ఇంజన్ ఎంత ముఖ్యమో.. కారు టైర్లు కూడా అంతే ముఖ్యం అని ప్రత్యేకించి చెప్పుకోవాల్సి పని లేదు. ఎందుకంటే ఎంత మంచి ఇంజన్ ఉన్నా.. టైర్ల కండిషన్ సరిగ్గా లేకపోతే ఆ కారు ముందుకు కదలదు. ఒకవేళ ముందుకు కదిలినా.. ఎక్కడ, ఏ రకమైన సమస్య తలెత్తేది తెలియదు. కారు టైర్లు బాగుంటే కారు కొండలైనా ఎక్కుతుంది. కారు టైర్లు బాగా లేకపోతే నేలపై కూడా నడవలేదు. టైర్లలో గాలి పీడనాన్ని చెక్ చేయడానికి వీలుగా టైర్ గేజ్‌ని ఎప్పుడూ మీతో ఉంచుకోవడం చాలా అవసరం. ఎందుకంటే సరైన టైర్లలో అవసరం అయిన మేరకు గాలి లేకపోతే.. అది టైర్లపై ఒత్తిడిని పెంచి అతి త్వరగా టైర్లు పాడయ్యేలా చేస్తుంది. కొన్నిసార్లు టైర్లు పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే కారు టైర్లు కూడా ఏదో ఒక లోకల్ టైర్లు అని కాకుండా మంచి నాణ్యత కలిగిన టైర్లనే ఉపయోగించాలి.


2) స్టీరింగ్ సిస్టమ్ : కారులో ఒక్కో విడి భాగానికి ఒక్కో ప్రత్యేకత. దేనిని తక్కువ అంచనా వేయలేం. అలాగే కారు స్టీరింగ్ కూడా చాలా ముఖ్యమైనది. కారును మీరు ఏ దిశలో తీసుకెళ్లాలంటే ఆ దిశలో తీసుకెళ్లేది ఈ స్టీరింగే కనుక స్టీరింగ్ కండిషన్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేస్కోండి. అలాగే కారు సర్వీసింగ్ సమయంలో స్టీరింగ్‌లో ఉండే ఫ్లూయిడ్స్ మార్చడం మర్చిపోవద్దు. 


3) కారు బ్రేక్స్ కూడా ముఖ్యమే : కారు వేగంగా వెళ్లాలంటే ఇంజన్ కండిషన్ లో ఉండటం ఎంత ముఖ్యమో.. అలాగే ఆ కారును ఎక్కడ, ఎప్పుడు నిలపాలనుకున్నా కారు బ్రేక్స్ కండిషన్ కూడా అంతే ముఖ్యం. కారు బ్రేక్స్ సరిగ్గా పనిచేయకపోతే కారు ప్రమాదాల బారిన పడొచ్చు. అందుకే తరచుగా కారు బ్రేక్స్ చెక్ చేయించాలి. సర్వీసింగ్ సమయంలో బ్రేక్ ప్యాడ్స్ కండిషన్ చెక్ చేయడంతో పాటు ఫ్లూయిడ్స్ కూడా మార్చాలి. కారు పాతదయ్యే కొద్దీ సమస్యలు తలెత్తే వాటిలో ఇది కూడా ఒకటి.


4) కారు ఫ్యూయెల్ లైన్ : కారులో ఫ్యూయెల్ ట్యాంక్ నుంచి ఇంధనాన్ని ఇంజన్ కి మోసుకెళ్లడంలో ఫ్యూయెల్ లైన్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే కారు పాతదయ్యే కొద్ది ఈ ఫ్యూయెల్ లైన్ పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ కారు ఫ్యూయెల్ లైన్ చెడిపోతే.. అది కారు మైలెజీపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఫ్యూయేల్ లీక్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే ఫ్యూయెల్ లైన్ చెక్ చేయించడంలో నిర్లక్ష్యం వహించొద్దు.


5) సీట్ బెల్ట్ మార్చడం : లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. కారు పాతదయ్యింది అంటే ఆ కారు సీటు బెల్ట్ కూడా అంతే ఎక్కువగా ఉపయోగించి ఉంటారు కదా..  ఈ క్రమంలో సీటు బెల్టులో ఏదైనా పరికరం దెబ్బతింటే అనుకోని ప్రమాదాలు తలెత్తినప్పుడు ఆ సీటు బెల్ట్ ఊడిపోయే ప్రమాదం ఉంటుంది. అది మీ భద్రతకు అతి పెద్ద ముప్పుగా పరిణమిస్తుంది. ఎందుకంటే కారు ప్రమాదాల్లో ప్రయాణికులు తీవ్రంగా గాయపడటం వెనుకున్న కారణాల్లో ఈ సీటు బెల్టే అతి ముఖ్యమైనది. రోడ్డు ప్రమాదం తీవ్రతను బట్టి సీటు బెల్ట్ ధరించకపోతే ప్రాణాలు కూడా పోతాయి. అందుకే సీటు బెల్టే కదా అని లైట్ తీసుకోకండి.