Digital Payments: యూపీఐ పేమెంట్స్‌పై కేంద్రం కీలక ప్రకటన.. ఆగస్టు 15 నాటికి ప్రతి గ్రామానికి..!
UPI Based Payments in India: ఈ ఏడాది స్వాత్రంత్య్ర దినోత్సవ నాటికి ప్రతి గ్రామంలో డిజిటల్ పేమెంట్స్ చేసేలా కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అన్ని పంచాయతీలకు కూడా యూపీఐ పేమెంట్స్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా..
UPI Based Payments in India: ప్రస్తుతం మన దేశంలో పట్టణాల నుంచి పల్లెల వరకు డిజిటల్ పేమెంట్స్ వైపు అడుగులు పడుతున్నాయి. షాపులకు వెళ్లి నగదు ఇచ్చి కొనుగోలు చేయడం చాలా వరకు తగ్గిపోయింది. ప్రజలను డిజిటల్ లావాదేవీలు చేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఆగస్టు 15వ తేదీ నాటికి అన్ని పంచాయతీలను యూపీఐ పేమెంట్స్ సౌకర్యంతో సన్నద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలోని అన్ని పంచాయతీలు ఈ స్వాతంత్ర్య దినోత్సవం నుంచి తప్పనిసరిగా అభివృద్ధి పనులు, ఆదాయ సేకరణ కోసం డిజిటల్ చెల్లింపు సేవలను ఉపయోగించుకునేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందరినీ యూపీఐ వినియోగదారులుగా ప్రకటించాలని చూస్తున్నట్లు పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
యూపీఐ పేమెంట్స్ వినియోగిస్తున్న పంచాయతీలను ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సమక్షంలో ప్రకటించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 98 శాతం పంచాయతీలు యూపీఐ ఆధారిత పేమెంట్స్ చేస్తున్నాయని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సునీల్ కుమార్ వెల్లడించారు. పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (పీఎంఎఫ్‌ఎస్) ద్వారా దాదాపు రూ.1.5 లక్షల కోట్లు చెల్లించినట్లు చెప్పారు. ఇకపై పంచాయతీలకు డిజిటల్ చెల్లింపులు జరగనున్నాయని తెలిపారు. చెక్కు, నగదు చెల్లింపు దాదాపు ఆగిపోతుందని పేర్కొన్నారు.
డిజిటల్ చెల్లింపులు దాదాపు ప్రతిచోటా చేరుకుందని సునీల్ కుమార్ తెలిపారు. ఇప్పటికే దాదాపు 98 శాతం పంచాయతీలను కవర్ చేశామన్నారు. నేడు సర్వీస్ ప్రొవైడర్, వెండర్‌తో సమావేశం నిర్వహించాలని పంచాయతీలకు సూచించింది. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, బీమ్, మోబిక్విక్, వాట్సాప్ పే, అమెజాన్ పే, భారత్ పే వంటి యూపీఐ ప్లాట్‌ఫారమ్‌ల అధికారులు, ఉద్యోగుల వివరాలతో కూడిన జాబితాను పంచాయతీలకు మంత్రిత్వ శాఖ పంపించింది.
జూలై 15వ తేదీ నాటికి పంచాయతీలు తగిన సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంపిక చేసుకోవాలని సూచించింది. జూలై 30వ తేదీలోగా వెండర్ పేరు పెట్టాలని పేర్కొంది. మొత్తం ప్రాంతాన్ని కవర్ చేసే ఒకే విక్రేతను ఎంపిక చేయాలని చెప్పింది. రియల్ టైమ్‌లో లావాదేవీలను పర్యవేక్షించడానికి కేంద్రీకృత డ్యాష్‌బోర్డ్‌ను రూపొందించాలని కూడా సిఫార్సు చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా జిల్లా, బ్లాక్ స్థాయిలో అధికారులకు శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు.
డిజిటల్ లావాదేవీలను మొదలుపెట్టడంతో అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ తెలిపారు. ఇప్పటికే చాలా పంచాయతీలు డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. అవినీతిని అరికట్టేందుకు ఇది దోహదపడుతుందన్నారు. ఈ ఏడాది జనవరిలోనే బీమ్ ద్వారా రూ.12.98 లక్షల కోట్ల విలువైన 806.3 కోట్ల లావాదేవీలు జరిగాయని వెల్లడించారు. ఇందులో దాదాపు 50 శాతం లావాదేవీలు గ్రామీణ, పరిసర ప్రాంతాల్లోనే జరిగాయన్నారు.
Also Read: Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడిన అజిత్ అగార్కర్, షేన్ వాట్సన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి