Korn Ferry survey on Salary Hikes in india in 2023: ఆర్థిక మాంధ్యం ఎఫెక్ట్ కారణంగా ప్రైవేటురంగాల్లో ఈసారి జీతాల పెంపు ఉంటుందో ఉండదో అని దిగాలు పడుతున్న ఉద్యోగులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. కార్న్ ఫెర్రీ జరిపిన లేటెస్ట్ ఇండియా కాంపెన్సేషన్ సర్వే ప్రకారం ఈ ఏడాది సగటున 9.8 శాతం వేతనాల పెంపు ఉంటుందని అంచనాలు చెబుతున్నాయి. సర్వేలో వెల్లడించిన వివరాల ప్రకారం 2022 లో 9.4 శాతం వేతనాల పెంపు జరగ్గా.. 2023 లో వేతనాల పెంపు ఇంకొంత ఎక్కువగానే ఉండనుంది. సంస్థ అభివృద్ధి కోసం కృషి చేసిన వారికి, అధిక నైపుణ్యం, మెళకువలు కలిగి ఉన్న వారికి వేతనాల పెంపు ఇంకొంత ఎక్కువగానే ఉంటుందని కార్న్ ఫెర్రీ సర్వే అభిప్రాయపడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

818 సంస్థల్లో పనిచేస్తోన్న 8 లక్షలకుపైగా సిబ్బందిపై జరిపిన అధ్యయనంలో ఈ అంశాలు వెలుగుచూసినట్టు కార్న్ ఫెర్రీ సర్వే పేర్కొంది. కరోనావైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలంగా మారిన 2020 ఆర్థిక సంవత్సరంలో వేతనాల పెంపు 6.8 శాతంగా ఉండగా.. ఆ తరువాతి కాలంలో చోటుచేసుకున్న పరిణామాలు, అధినేతలు, సిబ్బంది పని తీరు ఆశాజనకంగా ఉండటంతో భవిష్యత్తుపై మరోసారి ఆశలు చిగురింపచేశాయి.     


2023 లో వేతనాల పెంపు సరళి గురించి కార్న్ ఫెర్రీ సర్వే పేర్కొన్న వివరాల ప్రకారం లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ సెక్టార్‌లో 10.2 శాతం శాలరీ హైక్ ఉండనుండగా.. హై టెక్నాలజీ ప్రోడక్ట్స్ సెక్టార్‌లో 10.4 శాతంగా ఉండనుంది. 


" ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. భారత్ జీడీపీ 6 శాతం వృద్ధితో గ్రాఫ్ పైకి సూచిస్తుండటంతో భారత్‌లో పరిస్థితి కొంత మెరుగ్గానే కనిపిస్తోంది " అని కార్న్ ఫెర్రీ సర్వే సంస్థ చైర్మన్ అండ్ రీజినల్ మేనేజింగ్ డైరెక్టర్ నవనీత్ సింగ్ తెలిపారు. అత్యధిక ఉత్పాదన కనబర్చిన వారికి 15 నుంచి 30 శాతం శాలరీ హైక్ అందినా ఆశ్చర్యపోనక్కర్లేదని నవనీత్ సింగ్ అభిప్రాయపడ్డారు. 


సర్వీస్ సెక్టార్‌లో 9.8 శాతం, ఆటోమోటివ్స్ సెక్టార్‌లో 9 శాతం, కెమికల్ సెక్టార్‌లో 9.6 శాతం, కన్సూమర్ గూడ్స్ సెక్టార్‌లో 9.8 శాతం, రీటేల్ సెక్టార్‌లో 9 శాతం శాలరీ హైక్ ఉంటుందని తమ సర్వేలో తేలిందని కార్న్ ఫెర్రీ సర్వే పేర్కొంది. మొత్తానికి ఆర్ధిక మాంద్యం ఎఫెక్టుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రైవేటు ఉద్యోగులకు ఇది కచ్చితంగా ఎంతో రిలీఫ్‌ని ఇచ్చే గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి.