Tata Motors Cars Prices: న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌ తయారు చేసిన కార్లు కొనుగోలు చేయాలని ప్లాన్స్ చేసుకుంటున్న కస్టమర్స్‌కి బ్యాడ్ న్యూస్. మే 1, 2023 నుండి టాటా మోటార్స్ తమ ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. టాటా మోటార్స్ కార్లు వేరియంట్స్, మోడల్‌ను బట్టి ధరల పెంపు దాదాపు 0.6 శాతం వరకు ఉంటుందని కంపెనీ తమ తాజా ఎక్స్ చేంజ్ లో పేర్కొంది. కార్ల ధరల పెరుగుదలకు ఒకవైపు పెరుగుతున్న ఇన్‌పుట్ ధరలు ఒక కారణమైతే.. కొత్తగా అమల్లోకి వచ్చిన బిఎస్ 6 రెండో దశ నిబంధనలు మరో కారణంగా టాటా మోటార్స్ స్పష్టంచేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మే 1 నుంచి కార్ల ధరల పెంచడం ద్వారా ధరల పెరుగుదల భారాన్ని కొంతమేరకు తగ్గించుకోవాలని టాటా మోటార్స్ ప్లాన్ చేస్తోంది. ధరలు పెరగడానికంటే ముందే కారు బుక్ చేసుకునే వారు ఈ ధరల పెంపు బారి నుంచి తప్పించుకోవచ్చు. లేదంటే పెరిగిన ధరల భారం మోయకతప్పదు. 2023లో గత 4 నెలల వ్యవధిలోనే టాటా మోటార్స్ ధరలను పెంచడం వరుసగా ఇది రెండోసారి. జనవరిలో 1.2 శాతం ధరలు పెరిగిన సంగతి గుర్తుండే ఉంటుంది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులతో పాటు బిఎస్ 6 నిబంధనల కారణంగా కార్లలో కొత్తగా అమర్చే పరికరాల వల్ల కార్ల ధరలు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం, వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలను పర్యవేక్షించడానికి వాహనాల తయారీదారులు తమ వాహనాలలో ప్రత్యేక పరికరాన్ని తప్పనిసరిగా అమర్చాల్సి ఉంటుంది. 


అయితే ఈ అదనపు పరికరం, ఉద్గారాల పర్యవేక్షణ వ్యవస్థ వల్లే కార్ల ధరలు కూడా అంతేస్థాయిలో పెరుగుతున్నాయి. టాటా మోటార్స్ ఒక్కటే కాకుండా మిగతా కంపెనీలు కూడా పెరిగిన ఖర్చుల భారాన్ని తట్టుకునేందుకు ధరల పెంపుదల బాటలో ప్రయణిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలోనూ అనేక కారణాలతో కార్ల ధరలు పెరుగుతూ వచ్చాయి. అలా మొత్తానికి గడిచిన ఏడాది కాలంలో వివిధ కంపెనీల కార్ల ధరల్లో భారీగానే పెరుగుదల కనిపించింది. అయినప్పటికీ కార్ల ధరల పెరుగుదల కార్ల విక్రయాలపై పెద్దగా ప్రభావం పడలేదు. టాటా మోటార్స్ కార్ల అమ్మకానికి విషయానికొస్తే.. 2022లో టాటా పంచ్, టాటా నెక్సాన్ కార్లు అత్యధికంగా అమ్ముడవడంతో టాటా మోటార్స్ పర్‌ఫార్మెన్స్‌లో పెరుగుదల కనిపించింది. 


సేఫ్టీ రేటింగ్స్ పరంగానూ టాటా కార్లకు భారీ డిమాండ్ ఉంది. మిగతా ఆటోమొబైల్ కంపెనీలు తయారు చేసే కార్ల కంటే టాటా మోటార్స్ తయారు చేసే కార్లే సేఫ్టీ రేటింగ్స్ లో నెంబర్ 1 స్థానంలో నిలుస్తుండంతో టాటా మోటార్స్ పర్ ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతూ వస్తోంది. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ కార్ల తయారీలోనూ టాటా మోటార్స్ చాలా అగ్రెసివ్ ప్లాన్స్ చేస్తోంది. ఇండియాలో ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రానిక్ కార్లను తయారుచేస్తోన్న ఆటోమొబైల్ కంపెనీ ఏదైనా ఉందా అంటే అది టాటా మోటార్స్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు.