Property Registration And Mutation Documents: మీ పేరు మీద ఏదైనా వ్యవసాయ భూమి కానీ లేదా ఏదైనా ఇంటి స్థలం కానీ లేదా మరేదైనా ఇల్లు కానీ కొన్నారా ? కొత్తగా కొన్న మీ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించడంతోనే మీరు రిలాక్స్ అవుతున్నారు కదా.. కేవలం రిజిస్ట్రేషన్‌తోనే మీరు కొన్న స్థిర ఆస్తిపై పూర్తి యాజమాన్య హక్కులు వచ్చేస్తాయని అనుకుంటున్నారా ? అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే. మరి ఇంకా ఏం చేయాల్సి ఉంటుంది ? కొనుగోలు చేసిన ఆస్తిపై యాజమాన్య హక్కులు బదిలీ కావాలంటే ఏమేం అవసరం అవుతాయో తెలుసుకోవాలంటే ఇదిగో ఈ వివరాలపై ఒక లుక్కేయండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎవరైనా ఒక వ్యక్తి ఇల్లు, ఇంటి స్థలం, వ్యవసాయ భూమి వంటి స్థిర ఆస్తులు కొనుగోలు చేసినప్పుడు, వారు తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతోనే ఇక తమ పని అంతా అయిపోయినట్టు రిలాక్స్ అయ్యే వాళ్ల సంఖ్యే ఎక్కువ. కానీ అది కరెక్ట్ కాదు.. ఎందుకంటే, ఒక వ్యక్తి ఒకే భూమిని చాలా మందికి విక్రయించడం వంటి ఘటనలు మీరు చూసే ఉంటారు. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే మీరు కొన్నఆస్తిని కేవలం రిజిస్ట్రేషన్ చేయించుకుని సరిపెట్టుకోకుండా తప్పనిసరిగా ఆ ఆస్తిని ప్రాపర్టీ మ్యుటేషన్‌ని చేయించాలి. ప్రాపర్టీ మ్యుటేషన్ అంటే, సంబంధిత తహశీల్దార్ ఆఫీసులో ఆర్ఓఆర్‌కి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్ఓఆర్ అంటే, రెవిన్యూ శాఖ వారు నిర్వహించే " రికార్డ్ ఆఫ్ రైట్స్ " అని అర్థం. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే.. భూమి యాజమాన్య హక్కుల రికార్డు అని అర్థమన్నమాట.


కొంతమంది మ్యుటేషన్, సేల్ డీడ్.. రెండూ ఒకటేనని భావిస్తారు. కానీ వాస్తవానికి ఆ రెండూ వేర్వేరు అనే విషయం గ్రహించాలి. సేల్ డీడ్ అనేది విక్రయానికి సంబంధించిన ఒప్పంద పత్రం లాంటిది మాత్రమే. కానీ మ్యుటేషన్ మాత్రం రెవిన్యూ శాఖ నిర్వహించే అధికారిక ప్రక్రియల్లో ఒకటి. ఈ మ్యుటేషన్ పూర్తి కానంత వరకు రెవిన్యూ శాఖ వద్ద ఉన్న అధికారిక రికార్డులలో మీరు కొన్న భూమి మీ పేరు పైకి బదిలి కానట్టే లెక్క అనే విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే, మీరు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసే ముందు ఆ ఆస్తి ఎవరి పేరు మీద ఉందో ముందుగానే చూసుకోవాలి. అంతేకాకుండా ఆ ​​ఆస్తి పేరు మీదు ఎవరైనా రుణం తీసుకున్నారా అనే విషయం కూడా క్రాస్ చెక్ చేసుకుంటే తరువాత ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ఉంటుంది.


వ్యవసాయ భూమి అయితే మండల రెవిన్యూ అధికారి మ్యుటేషన్ చేస్తారు. వీరినే తహశీల్దార్ అని కూడా పిలుస్తాం. అన్ని రాష్ట్రాల్లోనూ ఎంఆర్వోలను తహశీల్దార్ అనే పిలుస్తారు. ఒకవేళ మీరు కొనుగోలు చేసింది నివాస యోగ్యమైన భూమి అయితే, సంబంధిత గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా నివాస భూమి పేరు మార్చడం జరుగుతుంది. ఇప్పుడు అర్థం అయింది కదా.. ఏదైనా స్థిరాస్థిని కొనుగోలు చేస్తే దానిని ఆర్ఓఆర్‌లో నమోదు చేయించుకోవడం తప్పనిసరి అనే విషయం మర్చిపోవద్దు.