Took Poison On Instagram: పదో తరగతి చదువుతున్న విద్యార్థి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా ప్రకటిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని గౌతం బుద్ద నగర్ జిల్లాలో ఏప్రిల్ 26న అర్ధ రాత్రి 1.30 గంటలకు చోటుచేసుకుంది. పదో తరగతి చదివే బాలుడు సూసైడ్ చేసుకుంటున్నాడనే విషయాన్ని పసిగట్టిన నొయిడా పోలీసులు.. ఎలాగైనా సరే అతడిని రక్షించాలనే ధృడ నిశ్చయంతో వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌ పేరెంట్ కంపెనీ అయిన మెటా కంపెనీ హెడ్ క్వార్టర్స్ ని సంప్రదించారు. బాలుడి ప్రొఫైల్ డీటేల్స్ చెప్పి అతడి లొకేషన్ చెప్పాల్సిందిగా కోరారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నొయిడా పోలీసులు రిక్వెస్టుపై స్పందించిన మెటా కంపెనీ హెడ్ క్వార్టర్స్ సిబ్బంది వెంటనే బాలుడు ఉపయోగిస్తున్న ఇన్‌స్టాగ్రామ్‌ ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుందో చెక్ చేసి వారికి లొకేషన్ డీటేల్స్ ఇచ్చారు. నొయిడా ఫేస్ 2 లో బాలుడి లొకేషన్ ఉందని గుర్తించిన పోలీసులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించి వారు వెంటనే అక్కడికి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. బాలుడిని రక్షించాలనే తాపత్రయంతో పోలీసులు హుటాహుటిన అతడి ఇంటికి చేరుకున్నారు. 


తీరా చూస్తే అక్కడ సీన్ వేరే ఉంది. ఆ బాలుడు దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నాడు. ఇదేంట్రా అని అడిగితే.. ఇన్‌స్టాగ్రామ్‌ లో ఎక్కువ వ్యూస్ రావడం కోసం ఆ ఫేక్ సూసైడ్ వీడియో పోస్ట్ చేశానని చల్లగా సెలవిచ్చాడు. మరి నువ్వు తాగిన ఆలౌట్ లిక్విడ్ సంగతేంటని అడిగితే... ఖాళీ ఆలౌట్ సీసాలో నీళ్లు పోసి నింపానని.. దానినే తాగి సూసైడ్ చేసుకున్నట్టు నటించానని అంగీకరించాడు. అయినప్పటికీ పోలీసులు తమ రూల్ ప్రకారం అతడిని ముందుగా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. ఆ తరువాత తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి వారికి అప్పగించారు. బాలుడి ప్రవర్తన, మానసిక పరిస్థితి సరిగ్గా లేదని.. అతడిపై ఓ కన్నేసి ఉంచాలని తల్లిదండ్రులకు సూచించారు. అంతేకాకుండా అతడు సాధారణ పరిస్థితికి వచ్చేలా తరచుగా కౌన్సిలింగ్ ఇప్పించాల్సిందిగా బాలుడి పేరెంట్స్ కి స్పష్టంచేశారు.