Wife Protest Against Husband Family: నా భర్త నాకు కావాలి.. అత్తింటి ఎదుట వికలాంగురాలి న్యాయ పోరాటం
Wife Protest Against Husband Family: ఓవైపు యావత్ తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాలు నిర్వహిస్తోంటే.. మరోవైపు ఓ మహిళ తనకు న్యాయం చేయండి మహా ప్రభో అంటూ పోలీసులతో పాటు కనిపించిన వారినల్లా వేడుకుంటోంది.
Wife Protest Against Husband Family: ఓవైపు యావత్ తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాలు నిర్వహిస్తోంటే.. మరోవైపు ఓ మహిళ తనకు న్యాయం చేయండి మహా ప్రభో అంటూ పోలీసులతో పాటు కనిపించిన వారినల్లా వేడుకుంటోంది. దశాబ్ధి ఉత్సవాలు ఓవైపు... జీవితమే పోతోంది అంటూ వికలాంగురాలైన యువతి అరణ్య రోదన మరోవైపు.. తన భర్తను తనకు కాకుండా చేసి.. తమ జంటను విడదియ్యాలని కుట్ర పన్నారని ఆరోపిస్తూ ఓ వికలాంగురాలు అత్తమామల ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. తనకు తన భర్త జశ్వంత్ రెడ్డి కావాలి అంటూ ఆ యువతి ఎక్కని గడప లేదు.. తొక్కని మెట్టు లేదు.. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని.. పోలీసులు కూడా తన గోడు వినడం లేదు అని మీడియా ఎదుట వాపోయిన బాధితురాలు ... చివరకు అత్తింటి వారి ఇంటి ఎదుటే న్యాయపోరాటానికి దిగింది. మంగళవారం నాటికి ఆ యువతి ఆందోళన నాలుగవ రోజుకు చేరుకుంది.
కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం నరసన్నపల్లి గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బిక్కనూరు మండలం పొందుర్తి గ్రామానికి చెందిన రజిత అనే వికలాంగురాలు, కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామానికి చెందిన జశ్వంత్ రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. 6 నెలల క్రితం జశ్వంత్ రెడ్డి, రజితలు ఇద్దరూ పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. అంతా సాఫీగానే సాగిపోతోంది అని అనుకుంటున్న తరుణంలో నాలుగు నెలల తరువాత తమ కాపురంలోకి తన భర్త జశ్వంత్ రెడ్డి తండ్రి శ్రీనివాస్ రెడ్డి ఎంటరయ్యాడని.. తన భర్త జశ్వంత్ రెడ్డిని తన నుంచి వేరు చేసి తీసుకెళ్లిపోయాడని బోరుమంది.
మామ శ్రీనివాస్ రెడ్డి తన భర్త జశ్వంత్ రెడ్డిని తీసుకెళ్లినప్పటికీ.. తన భర్తే తన వద్దకు తిరిగి వస్తాడులే అని గత రెండు నెలలుగా ఎంతో ఆశగా ఎదురుచూసిన రజితకు నిరాశే ఎదురైంది. అంతేకాకుండా జశ్వంత్ రెడ్డిని శాశ్వతంగా తనకు దూరం చేసేలా తన భర్తకు మరో అమ్మాయితో వివాహం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలుసుకున్న రజిత.. తనకు న్యాయం కావాలని పోలీస్ స్టేషన్ చూట్టు తిరిగింది. ఎవ్వరూ స్పందించకపోవడంతో చివరకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇలా తన భర్త గ్రామమైన నరసన్నపల్లిలోని ఇంటి ఎదుట రజిత ఆందోళనకు దిగింది.
తన భర్తను తనకు అప్పగించాలని అత్తమామలను వేడుకుంది. గత నాలుగు రోజులుగా అత్తమామల ఇంటి ఎదుట ధర్నా చేస్తున్నప్పటికీ ఎవ్వరూ పట్టించుకోవడంలేదని రజిత ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త జశ్వంత్ రెడ్డిని తనకు అప్పగించాలని.. తమ జంటను విడదీసి వికలాంగురాలినైన తనకు అన్యాయం చేయొద్దు అని కన్నీరుమున్నీరుగా విలపిస్తూ అత్తవారింటి ఎదుటే కూర్చుని ఉంది.