Suicide Before Marriage: ఇంకొన్ని గంటల్లో పెళ్లి.. ఇంతలోనే పెళ్లి కొడుకు సూసైడ్
Suicide Before Marriage: పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు పెళ్లి జరగాల్సిన రోజే ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
Suicide Before Marriage: పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు పెళ్లి జరగాల్సిన రోజే ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు వెల్లడించిన కథనం ప్రకారం సదాశివనగర్ మండలం అడ్డూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రాజేందర్ రెడ్డి అనే 29 ఏళ్ల యువకుడికి , రాంపూర్ గ్రామానికి చెందిన ఓ యువతితో ఈ నెల 7వ తారీఖున పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 3వ తారీఖున బంధువులకు పెళ్లి పత్రికలు పంచి వస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన రాజేందర్ రెడ్డి తిరిగి ఇంటికి రాకపోవడంతో స్నేహితులు, బంధువులు, చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.
ఇదిలావుండగానే నిన్న సాయంత్రం రాజేందర్ రెడ్డి లింగంపేట మండలం ఎల్లారం గేటు సమీపంలో ఓ చెట్టుకు ఉరివేసుకున్న మృతదేహం లభ్యమైంది. దీంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కిందికి దింపారు. మృతుడి వద్ద లభించిన పెళ్లి ఆహ్వాన పత్రికలు, తదితర ఆధారాలను పరిశీలించిన అనంతరం అతడిని రాజేందర్ రెడ్డిగా గుర్తించిన పోలీసులు.. అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు.. అక్కడ రాజేందర్ రెడ్డి మృతదేహం చూసి షాక్ అయ్యారు.
పెళ్లి కొడుకులా చూడాల్సిన తమ కొడుకుని నిర్జీవంగా పడి ఉండటం చూసి ఆ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు తట్టుకోలేక గుండెలవిసేలా రోధించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. పెళ్లి జరగాల్సిన ఇంట్లో అదే రోజు పెళ్లి కొడుకు ఆత్మహత్యకు పాల్పడటం పట్ల కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.
కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు లింగంపేట పోలీసులు తెలిపారు. పెళ్లికి సిద్ధపడిన రాజేందర్ తనే సూసైడ్ చేసుకున్నాడా లేక అతడిని ఎవరైనా బెదిరించారా ? అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రాజేందర్ మనస్తత్వం ఎలాంటిదని.. అతడికి ఏమైనా ప్రేమ వ్యవహారాలు ఉన్నాయా ? లేక ఈ పెళ్లి అతడికి ఇష్టం లేక ఈ పని చేశాడా అంటూ రాజేందర్ కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులను అడిగి తెలుసుకుని మరిన్ని వివరాలు రాబట్టే పనిలో లింగంపేట పోలీసులు బిజీ అయ్యారు. ఇదిలావుంటే, మరోవైపు రాజేందర్ ని పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలని ఎన్నో కలలు గన్న యువతి కుటుంబంలోనూ ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. పెళ్లి బాజాలతో కలకలలాడుతున్న ఆ ఇంట్లో వరుడి సూసైడ్ న్యూస్ విషాదం నింపింది.