Boy Loots Jewellery Shop: ప్లాస్టిక్ తుపాకీతో జువెలరీ షాపులో చోరీ.. మైనర్ బాలుడు అరెస్ట్
Boy Loots Jewellery Shop: ముంబై: చిన్న పిల్లలపై సినిమాల ప్రభావం భారీగా ఉంటోందనడానికి నిదర్శనంగా ముంబైలో తాజాగా ఓ ఘటన చోటుచేసుకుంది. బాలుడిని విచారించే క్రమంలో పోలీసులకు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకొచ్చాయి.
Boy Loots Jewellery Shop: ముంబై: చిన్న పిల్లలపై సినిమాల ప్రభావం భారీగా ఉంటోందనడానికి నిదర్శనంగా ముంబైలో తాజాగా ఓ ఘటన చోటుచేసుకుంది. సినిమాల్లో జువెలరీ షాపుల్లో చోరీలను చూసి ఇన్ స్పైర్ అయ్యాడో ఏమో తెలియదు కానీ తుపాకీ చేతిలో ఉంటే నగల దుకాణం దోచుకోవచ్చని అనుకున్నట్టున్నాడు బహుశా.. బొమ్మ తుపాకీ చేతపట్టుకుని నగల దుకాణంలో చోరీకి బయల్దేరిన ఓ మైనర్ బాలుడు పోలీసుల చేతికి చిక్కిన ఘటన ఇది. పోలీసుల చేతికి చిక్కిన బాలుడు.. తాను చోరీకి పాల్పడటానికి వెనుకున్న కారణం చెప్పడం విని షాకవడం పోలీసుల వంతయ్యింది.
షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి డబ్బు సంపాదించేందుకే తాను చోరీకి వెళ్లానని మైనర్ బాలుడు పోలీసుల విచారణలో అంగీకరించాడు. శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో భయందర్ వెస్ట్ ప్రాంతంలోని 60 ఫీట్ రోడ్డులో ఉన్న శక్తి జ్యువెలర్స్ షాపులో ఈ ఘటన జరిగింది. ముంబై పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మొదట జువెలరీ దుకాణానికి వెళ్లిన మైనర్ బాలుడు.. తన వద్ద కొన్ని బంగారు బిస్కెట్లు ఉన్నాయని.. అవి కొనుగోలు చేయాల్సిందిగా కోరుతూ దుకాణం యజమానికి చూపించాడు. అయితే బాలుడు చూపించిన బంగారం బిస్కెట్లు కొనడానికి నిరాకరించిన యాజమాన్యం.. అతడిని వెళ్లిపోవాల్సిందిగా చెప్పింది. యజమాని కోరిక మేరకు అక్కడి నుంచి వెళ్లిపోయిన బాలుడు.. కొన్ని నిమిషాలకే చేతిలో ప్లాస్టిక్ తుపాకీతో దుకాణానికి తిరిగొచ్చాడు.
భయందర్ వెస్ట్ ప్రాంతానికి చెందిన ఈ మైనర్ బాలుడు.. జువెలరీ షాపులో ఉన్న సిబ్బంది ఆ తుపాకీ నిజమైన తుపాకీ కాదు.. బొమ్మ తుపాకీ అని గుర్తించలేకపోయారు. బాలుడు కూడా జువెలరీ షాపు దోచుకుని తాను అనుకున్న పని చేసుకుని తిరిగి వెళ్లిపోయే క్రమంలోనే స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. దుకాణం యాజమాన్యం ఫోన్ చేయడంతో ఘటనా స్థలికి వచ్చి దుకాణంలో చోరీకి వచ్చిన బాలుడిని, అతడి చేతిలో ఉన్న బొమ్మ తుపాకీని చూసి నివ్వెరపోయారు.
బాలుడిని విచారించే క్రమంలో పోలీసులకు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకొచ్చాయి. టీ కొట్టు వ్యాపారం చేస్తున్న ఆ బాలుడి తండ్రికి ఒక డీమ్యాట్ ఖాతా ఉంది. ఆ డీమ్యాట్ ఖాతాను ఈ బాలుడే నిర్వహిస్తున్నాడు. పైగా పెట్టుబడి పెట్టినంతలో లాభాలను కూడా ఆర్జించాడు. దాంతో మరింత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి మరిన్ని అధిక లాభాలు సంపాదించాలనే ఆలోచనకు వచ్చిన ఈ 16 ఏళ్ల బాలుడు.. ఇలా జువెలరీ షాప్ చోరీకి స్కెచ్ వేసి అడ్డంగా దొరికిపోయాడు. బాలుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అతడి వద్ద ఉన్న ప్లాస్టిక్ తుపాకీని స్వాధీనం చేసుకుని చట్టరీత్యా తదుపరి చర్యలకు పూనుకున్నారు.