Sukhdev Singh Shot Dead Video: రాజస్థాన్‌లోని జైపూర్‌లో శ్రీ రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని హత్య ఘటన ప్రకంపనలు రేపుతోంది. రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ ణిసేన, ఇతర సంఘాటు రాష్ట్రవ్యాప్తంగా బుధవారం బంద్ చేపట్టాయి. మంగళవారం సుఖ్‌దేవ్‌ను దుండగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. సుఖ్‌దేవ్‌ను కాల్చిచంపిన ఇద్దరు నిందితులను పోలీసులు గుర్తించారు. ఒక నిందితుడి పేరు రోహిత్ రాథోడ్. నాగౌర్‌లోని మక్రానా నివాసి కాగా.. మరొకరి పేరు నితిన్ ఫౌజీ. అతను హర్యానాలోని మహేంద్రగఢ్ నివాసి. ప్రస్తుతం వీరిద్దరూ పరారీలో ఉన్నారు. వారిద్దరూ కలిసి సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని హత్య చేశారు. పూర్తి వివరాలు ఇలా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంగళవారం జైపూర్‌కు చెందిన జౌళి వ్యాపారి నవీన్ షెకావత్, మరో ఇద్దరు యువకులతో కలిసి రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి ఇంటికి వచ్చారు. సుఖ్‌దేవ్ సోఫాలో ఒకవైపు.. యువకులిద్దరూ ఆయన ముందు కూర్చున్నారు. అతని పక్కనే నవీన్ షెకావత్ కూడా కూర్చున్నాడు. నలుగురూ ఏదో ఒక విషయం గురించి తమలో తాము మాట్లాడుకుంటూ ఉండగా.. సుఖ్‌దేవ్ మొబైల్‌కి కాల్ వచ్చింది. సుఖ్‌దేవ్ కాల్‌ను తీయగానే.. నవీన్‌తో పాటు ఉన్న ఇద్దరు యువకులలో ఒకరు హఠాత్తుగా లేచి సుఖ్‌దేవ్‌పై కాల్పులు జరిపాడు.


 



వెంటనే మరో యువకుడు తపాకీ తీసుకుని కాల్పుడు జరిపాడు. సుఖ్‌దేవ్‌పై కాల్పులు జరిపిన వెంటనే.. శరీరం నుంచి రక్తం కారుతూ కుప్పకూలిపోయాడు. నవీన్ షెకావత్‌పై కూడా కాల్పులు జరిపేందుకు ప్రయత్నించగా.. ఆయన తృటిలో తప్పించుకున్నాడు. సుఖ్‌దేవ్ సెక్యూరిటీగా ఉన్న వ్యక్తిపై కాల్పులు జరపగా.. ఆయన అక్కడే కిందపడిపోయాడు. కాల్పుల అనంతరం వెళ్లే సమయంలో ఓ దుండగుడు మళ్లీ వెనక్కి వచ్చి గోగమేడి తలపై కాల్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


కాల్పుల అనంతరం దుండగులిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. బయట ఉన్న సుఖ్‌దేవ్  భద్రతా సిబ్బంది వాళ్లను ఆపేందుకు ప్రయత్నించగా.. వారిపై కూడా కాల్పులు జరిపారు. సెక్యూరిటీ గార్డు అజిత్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. కాల్పుల అనంతరం ఓ వీధిలో నుంచి ఇద్దరు దుండగులు పారిపోయే క్రమంలో కారును ఆపి దోచుకోవడానికి ప్రయత్నించారు. డ్రైవర్‌కు పిస్టల్‌ చూపించి గాలిలోకి కాల్పులు జరిపి డ్రైవర్‌ పరార్ అయ్యారు.


ఇంట్లో రక్తపు మడుగులో సోఫాలో పడి ఉన్న సుఖ్‌దేవ్‌ గోగమేడిని వెంటనే చికిత్స నిమిత్తం మెట్రో మాస్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికి మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. సుఖేదేవ్ హత్య ఘటన రాజస్థాన్ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. శ్యామ్‌నగర్ పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని.. వివరాలు సేకరించారు. మరోవైపు గోగమేడి అభిమానులు ఆసుపత్రి బయట నిరసనలు ప్రారంభించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. మానసరోవర్‌లో రోడ్లను దిగ్బంధించారు.


ఈ ఘటనపై జైపూర్ పోలీస్ కమిషనర్ బిజు జార్జ్ జోసెఫ్ మాట్లాడుతూ.. సుఖ్‌దేవ్ ఇంట్లో అమర్చిన సీసీటీవీలో ఈ ఘటన మొత్తం రికార్డయ్యిందని తెలిపారు. 20 సెకన్ల వ్యవధిలో 6 బుల్లెట్లు పేలినట్లు గుర్తించామన్నారు. మొత్తం 17 రౌండ్ల కాల్పులు జరిగాయని.. నిందితులు ఎస్‌యూవీ కారులో వచ్చారని చెప్పారు. గోగమేడి ఇంటి వద్ద వారి కారు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆ కారులో బ్యాగ్, మద్యం సీసా, ఖాళీ గ్లాసులు లభ్యమయ్యాయని తెలిపారు. సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి ఘటన తరువాత రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని డీజీపీ ఉమేష్ మిశ్రా ఉన్నతాధికారులను ఆదేశించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 


Also Read: CM YS Jagan Mohan Reddy: ఏపీపై మిచౌంగ్ తుపాను భారీ ఎఫెక్ట్.. సీఎం జగన్ కీలక ప్రకటన  


Also Read: Arvind Krishna: FIBA లీగ్‌లో హైదరాబాద్‌ జట్టుకు కెప్టెన్‌గా సినీ హీరో.. దుమ్ములేపుతున్నాడుగా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి