Sangareddy Chemical Factory Blast News: సంగారెడ్డి జిల్లా ఎస్బీ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. ఎస్బీ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్లు పేలిపోయాయి. దీంతో ఒక్కసారిగా కార్మికులు ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 10 మంది కార్మికులు గాయపడ్డారు. హత్నూర మండలంలోని చందాపూర్లో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పేలుడు సమయంలో పరిశ్రమలో 50 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. పేలుడు ధాటికి పరిసర ప్రాంతాల్లో పలు నిర్మాణాలు కూలిపోయాయి. మంటల్లో చిక్కుకున్న కార్మికులు కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరో రియాక్టర్ పేలితే ప్రమాదం అని అధికారులు అంటున్నారు. పరిశ్రమ పరిసర ప్రాంతాల నుంచి ప్రజలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గాయపడిన వారిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో మేనేజర్ రవితోపాటు ఆరుగురు కార్మికులు ఉన్నారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలో మూడు భవనాలు కూలిపోయాయి. నాలుగు ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాయి. భవనాలపై ఎవరు ఉన్నారని పోలీసులు ఆరా తీస్తున్నారు. పరిశ్రమలో మరో రియాక్టర్‌కు మంటలు వ్యాపించాయి. 


ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో చోటు చేసుకున్న ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. రియాక్టర్ పేలడంతో  మంటలు చెలరేగినట్లు అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తక్షణమే సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. మంటలు అదువులోకి తీసుకురావాలని అగ్నిమాపక శాఖ అధికారులకు సూచించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందజేయాలన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.