Gaddar Awards: `గద్దర్ అవార్డు`లపై సినీ పరిశ్రమ మౌనం.. తొలిసారి మోహన్ బాబు ఏమన్నారంటే..?
Mohan Babu Reaction Gaddar Awards: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సినీ అవార్డుల విషయంలో తీసుకున్న పేరు మార్పుపై సినీ పరిశ్రమ నుంచి స్పందన లేదు. నంది అవార్డులను గద్దర్ పేరిట ఇస్తామని ఇటీవల రేవంత్ రెడ్డి ప్రకటించగా.. ఈ నిర్ణయంపై డైలాగ్ కింగ్ మోహన్ బాబు స్పందించారు.
Gaddar Awards Mohan Babu: తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిభ గలవారిని గుర్తించి ఇన్నాళ్లు నంది అవార్డులు ఇస్తుండగా తాజాగా దాని పేరును మారుస్తానని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. గద్దర్ అవార్డులపై సినీ పరిశ్రమ నుంచి తొలి స్పందన వచ్చింది. అవార్డుల పేరు మార్చడంపై సినీ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు స్పందించారు. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం హర్షాతిరేకమని ప్రకటించారు. ఈ సందర్భంగా ట్విటర్ వేదికగా మోహన్ బాబు ఓ ట్వీట్ చేశారు.
'గద్దర్ పేరిట అవార్డులను నెలకొల్పిన తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నా. ఇది సాంస్కృతిక గుర్తింపు పట్ల వారికున్న నిబద్ధతకు నిదర్శనం. నా సోదరుడు గద్దర్ విషయంలో మరోసారి గర్వపడుతున్నా. గద్దర్ పాటలు సమాజ పరివర్తనకు ఉత్ప్రేరకంగా పని చేశాయి. గద్దర్ పేరిట అవార్డులను ఇవ్వడం అనేది ఆయన చేసిన కృషికి, త్యాగానికి గొప్ప గౌరవ సూచకంగా భావిస్తున్నా. వ్యక్తిగతంగా ఈ నిర్ణయం నాకు గొప్ప అనుభూతి ఇచ్చింది' అంటూ మోహన్ బాబు 'ఎక్స్'లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా గద్దర్‌తో దిగిన ఫొటోను ఆయన పంచుకున్నారు.
పరిశ్రమ మౌనం
అవార్డుల పేరు మార్పుపై సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి స్పందన లేదు. సినీ పరిశ్రమకు పేరు మార్పు నచ్చలేదని తెలుస్తోంది. కాగా అవార్డుల పేరు మార్పుపై ప్రజల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. గద్దర్ గొప్ప వ్యక్తే కానీ ఆయనకు సినీ పరిశ్రమకు పెద్దగా అనుబంధం లేదని గుర్తుచేశారు. గద్దర్ పేరిట ప్రత్యేక అవార్డును నెలకొల్పి కవులు, కళాకారులకు పురస్కారం ఇవ్వాలని సూచిస్తున్నారు. సినీ పరిశ్రమకు సంబంధించిన అవార్డులకు మాత్రం ఇతర పేరు పరిశీలించాలని చెబుతున్నారు. గద్దర్ మీద గౌరవంతో మంచి నిర్ణయమే తీసుకున్నా.. ఆ నిర్ణయం సరికాదని పేర్కొంటున్నారు. సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు.
గద్దర్ తో అనుబంధం
కాగా మోహన్‌బాబుకు గద్దర్ మధ్య మంచి అనుబంధం ఉంది. మోహన్ బాబు నటించిన సినిమాల్లో గద్దర్ పాటలు పాడారు. ఈ అనుబంధంతోనే గద్దర్ చనిపోయినప్పుడు మోహన్ బాబు కుటుంబం మొత్తం తరలివచ్చింది. గద్దర్ మృతదేహానికి నివాళులర్పించారు. తెలంగాణ నుంచి సినీ పరిశ్రమకు చాలా మంది వచ్చి ఉన్నారు. పైడి జైరాజ్, కత్తి కాంతారావు తదితర నటీనటులు, దర్శక నిర్మాతలు ఉన్నారని గుర్తుచేస్తున్నారు. తెలంగాణలోని ఇతర ప్రముఖుల పేరుతో ఇవ్వాలని, లేదా తెలంగాణ అనుబంధంతో ఉన్న ఏదైనా పేరును అవార్డులకు పెట్టాలని సూచిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు తమకు తోచిన పేర్లను ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేస్తున్నారు.
Also Read: King Cobra on Fan: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఇంట్లో ఫ్యాన్‌పై తిరుగుతూ కింగ్ కోబ్రా హల్‌చల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి