టాలీవుడ్, కోలీవుడ్ సినీ పరిశ్రమలకి చెందిన పలువురు సినీ ప్రముఖులపై కాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణలు చేసి సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి తెలుగు, తమిళ సినీ పరిశ్రమలకు చెందిన ఎందరో తనని వాడుకున్నారని, అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు అన్నీ తన వద్ద ఉన్నాయని మొదటి నుంచీ చెబుతూ వస్తోన్న శ్రీరెడ్డి... తాజాగా తన రియల్ స్టోరీనే సినిమాగా మలిచేందుకు నిర్ణయించుకున్నట్టు ప్రకటించింది. ‘రెడ్డి డైరీ’ పేరుతో తమిళంలో తెరకెక్కనున్న సినిమాకు తన స్వీయ చరిత్రనే కథాంశంగా అందించనున్నట్టు ఆమె స్పష్టంచేసింది. చెన్నై ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీరెడ్డి ఈ వివరాలను వెల్లడించడం సినీవర్గాల్లో సంచలనం సృష్టించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా రెడ్డి డైరీ సినిమా దర్శకుడు అల్లావుద్దీన్‌ మాట్లాడుతూ... శ్రీరెడ్డి జీవితంలో చోటుచేసుకున్న యదార్థ ఘటనల ఆధారంగా రెడ్డి డైరీ సినిమాను తెరకెక్కిస్తున్నామని తెలిపారు. శ్రీరెడ్డి మాట్లాడుతూ... తాను నటించబోయే రెడ్డి డైరీ చిత్రానికి నడిగర్‌ సంఘం నుంచి ప్రోత్సాహం లభించినట్టు చెప్పింది. అంతేకాకుండా రెడ్డి డైరీ సినిమా ద్వారా తనని లైంగికంగా వాడుకున్న వారి వివరాలను బహిర్గతపర్చనున్నట్టు శ్రీరెడ్డి మరోసారి తేల్చిచెప్పింది. దీంతో మొదటి ప్రెస్ మీట్ సమావేశంతోనే శ్రీరెడ్డి తన రియల్ స్టోరీ సినిమాపై సినీవర్గాల్లో, ఆడియెన్స్‌లో ఆసక్తి కలిగేలా చేసింది. అయితే, రెడ్డి డైరీ అనే టైటిల్ మాత్రం కచ్చితంగా వివాదాస్పదం అయ్యే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.