బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ అమరవీరుల కుటుంబాల కోసం తనదైన శైలిలో స్పందించి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. ఈ యేడాది దీపావళి సందర్భంగా ఆయన  సరిహద్దుల్లో కాపలా కాస్తూ ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాల కోసం ఏదైనా చేయాలనుకున్నారు. అందుకే అనుకున్నదే తడవుగా మహారాష్ట్ర రాష్ట్రంలోని కోల్హాపూర్ రేంజ్ ఆర్మీ అధికారులను కలిశారు. వారి నుండి ఎంపిక చేసిన 103 మంది అమరవీరుల కుటుంబాల వివరాలు సేకరించారు.


దీపావళి కానుకగా ఒక్కో కుటుంబానికి 25 వేల రూపాయల చెక్కు, ఒక సందేశంతో కూడిన లేఖ మరియు వారి పిల్లల కోసం మిఠాయిలు, పుస్తకాలు పంపించారు. "ఈ దీపావళి పర్వదినం నాడు  అమరవీరుల కుటుంబీకులైన మిమ్మల్ని చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. మీరు మీ ప్రియమైన వారితో గడపలేకపోతున్నారని నాకు తెలుసు. అందుకే మీరు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లి నూతన జీవితాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నాను. మీకోసం మిఠాయిలు, పిల్లల కోసం పుస్తకాలు పంపిస్తున్నాను. దయచేసి ప్రేమతో అంగీకరించండి" అని ఆయన తన  సందేశంలో తెలిపారు.