టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కా శర్మ జంట సోషల్ మీడియాలో చేసే సందడి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అనుష్కా శర్మ హాజరైన క్రికెట్ మ్యాచ్‌లో తాను సెంచరీ కొట్టాడంటే.. వెంటనే తన ప్రియమైన శ్రీమతి వైపు చూస్తూ విరాట్ కోహ్లీ ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం, ఆ ఫ్లయింగ్ కిస్ అందుకుంటున్నట్టుగా ఆమె స్పందించడం వంటి వీడియోలు టీవీల్లో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నవే. అవే కాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఈ సెలబ్రిటీ కపుల్ పోస్ట్ చేసే ఫోటో, వీడియోలు సైతం వీరిని మరింత పాపులర్ చేశాయి. అందుకే ఇవే ఉదాహరణలుగా చూపిస్తూ.. తాజాగా బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ అనుష్కా శర్మను ఆట పట్టించారు. తాను హోస్టింగ్ చేస్తోన్న కౌన్ బనేగా కరోడ్ పతి గేమ్ షోకి అతిధిగా హాజరైన అనుష్కా శర్మను, ఉద్దేశిస్తూ టీవీల్లో ఏం జరుగుతుందో మేమంతా చూస్తున్నాంలే అంటూ అమితాబ్ టీజ్ చేయడంతో.. బిగ్ బీ టీజింగ్ చూసి నవ్వడం అనుష్కా శర్మ వంతయ్యింది.



ఇదే గేమ్ షోలో మరో అతిథిగా పాల్గొన్న ప్రముఖ సామాజిక సేవకురాలు, పద్మశ్రీ సుధా వర్గీస్‌, బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్‌ను కూడా ఈ వీడియోలో చూడవచ్చు.