రంగమ్మత్త గురించి ఆసక్తికరమైన అంశాలు
యాంకర్ అనసూయ నోట.. రంగమ్మత్త మాట..
రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర పోషించిన యాంకర్ అనసూయ ఆ పాత్రతో అందరి మన్ననలు అందుకుంది. యాంకర్ అనసూయలో ఇంత నటనా ప్రతిభ దాగి వుందా అని ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు ఆ సినిమాలో ఆమె అభినయాన్ని చూసిన ఆడియెన్స్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయంపై యాంకర్ అనసూయ స్పందిస్తూ.. రంగమ్మ పాత్ర చేయడం గురించి పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడించింది. " మొదట మైత్రీ మూవీ మేకర్స్ నుంచి తనకు ఫోన్ చేసిన నిర్మాతలు.. డైరెక్టర్ సుకుమార్ ఓ స్టోరీ చెప్పాలనుకుంటున్నారు అని చెప్పారు. వారు చెప్పినదాని ప్రకారమే వెళ్లి సుకుమార్ గారిని కలిశాను. ఆయన చెప్పిన రంగమ్మ పాత్ర గురించి విన్నాకా ఆ పాత్రను నేను చేయగలనా అనే అనుమానం కలిగింది. నాపై నాకే నమ్మకం లేదు. కానీ సుకుమార్ మాత్రం ధైర్యం చెప్పి, ఆ పాత్రను నువ్ చేయగలవు అని చెప్పి నన్ను ఒప్పించారు. ఒప్పించడమే కాకుండా అన్ని విధాల ఆ పాత్రకు నన్ను సిద్ధం చేశారు" అని రంగమ్మ పాత్ర చేసిన రోజులని గుర్తుచేసుకుంది.
సుకుమార్ గారితోపాటు అతడి డైరెక్షన్ డిపార్ట్ మెంట్ కూడా బాగా సహకరించారు. ఇక చరణ్ తో నేను చేసిన మొదటి షాట్ బోటులోనే. ఎంతో భయమేసింది. కానీ చెర్రీ కోపరేషన్ తో ఆ భయం అంతా ఎగిరిపోయింది అని రంగస్థలం జ్ఞాపకాలను నెమరేసుకుంది రంగమ్మ అత్త ఊరఫ్ యాంకర్ అనసూయ.