యాంకర్ ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
డ్రంక్ అండ్ డ్రైవ్ రేసులో హైదరాబాద్ పోలీసులకు దొరికిన టీవీ వ్యాఖ్యాత ప్రదీప్ కేసు ఊహించని మలుపు తిరిగింది.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో హైదరాబాద్ పోలీసులకు దొరికిన టీవీ వ్యాఖ్యాత ప్రదీప్ కథ ఊహించని మలుపు తిరిగింది. మూడేళ్ళ పాటు ఆయన డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు నాంపల్లి కోర్టు తీర్పు చెప్పింది. అలాగే రూ.2100 జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది. డిసెంబరు 31వ తేదిన న్యూ ఇయర్ పార్టీకి వెళ్లి స్నేహితులతో ఎంజాయ్ చేసి.. హోటల్ నుండి తిరిగివస్తున్న క్రమంలో ప్రదీప్ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డారు.
ఈ క్రమంలో ఆయనకు ఆల్కహాల్ టెస్టు నిర్వహించగా.. అందులో ఆయన మోతాదుకు మించి తాగినట్లు ఫలితం వచ్చింది. దీంతో ఆయన వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు తనను కౌన్సిలింగ్‌కు హాజరు కావాలని తెలిపారు. తొలుత ప్రదీప్ హాజరు కాకపోవడంతో.. ఆయన ఇంటికి పోలీసులు వారెంట్ పంపించారు.
ఈ క్రమంలో ఆయన ఈ నెల 8వ తేదిన తన తండ్రితో కలిసి వచ్చి కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు. అయినా.. కోర్టు ఆయన డ్రైవింగ్ లైసెన్స్‌ను క్యాన్సిల్ చేసి.. మూడేళ్ల పాటు ఎలాంటి వాహనం కూడా నడపద్దని ఆదేశించడం గమనార్హం.