కోలీవుడ్‌లో మరో తెలుగు హీరో..!
హైదరాబాద్ : "స్పైడర్" సినిమాతో తమిళ నాట కూడా ప్రేక్షకుల నాడిని పసిగట్టిన ప్రిన్స్ మహేష్ బాబు విజయాన్ని కైవసం చేసుకున్నాక ఇప్పుడు మరో తెలుగు హీరో కూడా కోలీవుడ్‌లో తన లక్‌ను పరీక్షించుకోనున్నారు.అతనే మంచు మోహన్ బాబు తనయుడు "మంచు విష్ణు". ‘కురల్ 388’ చిత్రం ద్వారా ఆయన తమిళ నాట తెరంగేట్రం చేస్తున్నారు. అదే చిత్రం తెలుగులో "ఓటర్" పేరిట విడుదల కానుంది. సంపత్‌రాజ్, పోసాని కృష్ణమురళి, నాజర్, మునీస్ కాంత్, బ్రహ్మానందంలు ఇతర తారాగణం. రామారీల్స్ బ్యానరుపై జాన్ సుదీర్‌కుమార్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించగా... తమన్ బాణీలను అందిస్తున్నారు. జీఎస్ గాంధీ దర్శకత్వం వహించే ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. తెలుగు హీరోలు అడపాదడపా తమిళ చిత్రాల్లో నటించడం కొత్తేమీ కాదు. ఎన్టీఆర్, ఎయన్నార్‌లు సైతం పలు తమిళ చిత్రాల్లో నటించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే మోహన్ బాబు, నాగార్జున, నాని లాంటి వారు గతంలో తమిళ చిత్రాల్లో నటించారు. నాగార్జున నటించిన రక్షకుడు, గగనం, ఊపిరి లాంటి చిత్రాలు కూడా డైరెక్టు తమిళ సినిమాలుగా విడుదల అయ్యాయి. ఈ క్రమంలో మరో తెలుగు హీరో తమిళనాట నటుడిగా పరిచయం కావడం మంచి పరిణామమే.