ఎస్‌.ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన వెండితెర దృశ్యకావ్యం ‘బాహుబలి’. ఇప్పుడు ఈ చిత్రాన్ని భోజ్‌పురిలో రీమేక్ చేయడానికి హక్కులను పొందారు భోజ్‌పురి నటుడు దినేశ్‌లాల్‌ యాదవ్‌. 'వీర్‌ యోధ మహాబలి’ అనే పేరుతో ఈ సినిమాని తెరకెక్కించనున్నట్లు తెలిపారు ఆయన. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ మహారాష్ట్రలో జరుగుతుంది.


ఇక్బాల్‌ భక్ష్ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ 15 జనవరి 2018 తేదీన విడుదల కానుంది. ఆమ్రపాలి దూబే హీరోయిన్‌గా నటించే ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్ చిత్రమేనని దినేశ్ లాల్ యాదవ్ తెలిపారు. ఆయన తన ఫేస్‌బుక్‌ ద్వారా ఈ 'వీర్‌ యోధ మహాబలి’ చిత్రానికి సంబంధించిన ఫోటోలను కూడా పంచుకున్నారు. అయితే ఈ భోజ్‌పురి రీమేక్ పై ఇప్పటి వరకు దర్శకుడు రాజమౌళి నుండి ఎలాంటి అప్‌డేట్ రాకపోవడం గమనార్హం. ప్రస్తుతం భోజ్‌పురి సినిమాల్లో నటిస్తున్న స్టార్ హీరోల్లో దినేశ్‌లాల్ యాదవ్ కూడా ఒకరు.