Balakrishna About Taraka Ratna: నందమూరి తారక రత్న మృతిపై నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తారక రత్న తనను బాల బాబాయ్.. బాల బాబాయ్ అంటూ ఆప్యాయంగా పిలిచేవాడని.. తనను అంత ఆప్యాయంగా పిలిచే మా తారకరత్న పిలుపు ఇక వినబడదు అనే ఊహించుకోవడాన్నే తాను తట్టుకోలేకపోతున్నాను అని నందమూరి బాలకృష్ణ ఆవేదన వ్యక్తంచేశారు. తారకరత్న మృతి నందమూరి అభిమానులకు, టిడిపి కుటుంబ సభ్యులకు తీరని లోటు అని బాలకృష్ణ పేర్కొన్నారు. నటనలోనూ తనకు తాను నిరూపించుకున్న హీరో తారక రత్న అని గుర్తుచేసుకుంటూ బాలయ్య బాబు కన్నీటి పర్యంతమయ్యారు. 


కుప్పం పాదయాత్రలో పాల్గొని గుండెనొప్పితో కుప్పకూలినప్పటి నుంచి మృత్యువుతో పోరాడుతూ వచ్చారని.. తారక రత్న పూర్తి ఆరోగ్యంతో కోలుకుని మృత్యుంజయుడై తిరిగి వస్తాడని ఆశించానని.. కానీ తారకరత్న ఇలా అందరినీ విడిచి ఇక కానరాని లోకాలకు వెళ్తాడని అనుకోలేదని చెబుతూ బోరుమన్నారు. తారతరత్న ఆత్మకు ఆ భగవంతుడు శాంతి కలిగించాలని కోరుకుంటున్నట్టు బాలకృష్ణ తెలిపారు.