ఎన్టీఆర్‌ బయోపిక్‌‌లో టైటిల్ పాత్రను బాలకృష్ణ పోషిస్తున్న సంగతి తెలిసింది. ఈ క్రమంలో ఈ చిత్ర దర్శకుడు తేజ పలు ముఖ్యమైన పనుల్లో నిమగ్నమై ఉన్నట్లు వినికిడి. ప్రధానంగా నటీనటుల ఎంపికకు సంబంధించి ఫైనలైజ్ అవ్వాల్సిన పేర్ల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం కూడా ఆయన తీసుకోలేదని సమాచారం. బాలయ్య కూడా ఈ విషయంలో సమయం తీసుకున్నా.. మంచి నిర్ణయాన్ని తీసుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఎన్టీఆర్‌ జీవితంలోని పాత్రల ఎంపికలో సహజత్వానికి దగ్గరగా ఉన్న నటీనటులను తీసుకోవాలని భావించిన బాలయ్య అందుకోసం ఒక హాలీవుడ్ టీమ్‌‌ను రిక్రూట్ చేసుకున్నారని కూడా సమాచారం. వారు ఇప్పటి వరకు ఎన్టీఆర్ నిజ జీవిత చరిత్రను స్టడీ చేసి.. 75 పాత్రలకు సంబంధించిన స్కెచ్‌లు వేశారట. దాదాపు 60 కోట్ల రూపాయలతో ఈ చిత్రం తెరకెక్కాల్సి ఉండగా.. ప్రస్తుతం పనుల ఎంత వరకు వచ్చాయన్న విషయంపై ఎలాంటి సమాచారం కూడా  రాకపోవడం గమనార్హం.


అలాగే ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో ప్రధానంగా అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీతో పాటు పలు రాజకీయ నాయకుల పాత్రలకు కూడా నటీనటులను ఎంపిక చేయాల్సి ఉంది కాబట్టి.. ఈ విషయంలో జాగ్రత్త వహించాలని నిర్మాతలు భావిస్తున్నారు. తొలుత ఈ సినిమాలో ఎన్టీఆర్ సతీమణి పాత్ర కోసం నిత్యా మీనన్‌ను అనుకున్నారని.. ఆ తర్వాత ఆ ఆలోచనను విరమించుకున్నారని కూడా తెలుస్తోంది. అలాగే ఇందిరాగాంధీ పాత్ర కోసం నటి నదియాను సంప్రదించారని కూడా సమాచారం. అలాగే ఎన్టీఆర్ అల్లుళ్ళు చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత్రలను ఎవరు పోషిస్తున్నారన్న విషయం కూడా ఆసక్తి రేపుతోంది.